Sunday, April 6, 2025

విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం అధికారులను ఆదేశించడం శుభపరిణామం. పరీక్షల భయం, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు విద్యార్థులను ఆత్మహత్య దిశగా పురిగొల్పుతున్నాయి. గత దశాబ్దకాలంగా బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నా అటు ప్రభుత్వాలు కానీ, ఇటు విద్యాసంస్థల యాజమాన్యాలు గానీ నిర్దుష్టంగా చేపట్టిన చర్యలంటూ ఏమీ లేవు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022లో వెలువరించిన ఓ నివేదిక ప్రకారం ఆ ఏడాది 13,044 మంది విద్యార్థులు ఉసురు తీసుకున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా 4% చొప్పున పెరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు శిక్షణ, మార్గదర్శకత్వం నెరపే ఐసి3 అనే స్వచ్ఛంద సంస్థ అంచనా వేసింది. ఇండియాలో సాధారణ ఆత్మహత్యల రేటు రెండు శాతంగా ఉంటే, విద్యార్థుల్లో అది నాలుగు శాతంగా ఉన్నట్లు లెక్కగట్టింది. ముఖ్యంగా వృత్తివిద్యకు సంబంధించిన శిక్షణ సంస్థల్లో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. గత ఏడాది ఢిల్లీలో ఓ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ పరీక్షలో ఆ ఏడాది సదరు విద్యార్థే టాపర్ కావడం గమనార్హం. ఇది జరిగిన మరునాడే ఐఐఎం- అహ్మదాబాద్ విద్యార్థి ఒకరు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో పది రోజులకు హైదరాబాద్‌కు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. విద్యార్థుల భద్రత, వారి శ్రేయస్సుకోసం ప్రతి విద్యాసంస్థ చర్యలు తీసుకోవాలని, మానసిక కుంగుబాటుకు, ఒత్తిడికి లోనుకాకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, సామాజిక సంస్థలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. వాస్తవానికి అత్యున్నత న్యాయస్థానం చెప్పకపోయినా, ఈ విషయాలన్నీ విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియవని అనుకోలేం. కానీ, చదువుల రంధిలో పడి, ర్యాంకుల సాధనే పరమావధిగా భావించే యాజమాన్యాలకు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి పట్టదనడానికి ఉదాహరణలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా గణాంకాలు తీస్తే, స్కూలు భవనాలపైనుంచి దూకి, హాస్టల్ గదుల్లో ఉరితాళ్లకు వేలాడి అసువులు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రేమ వ్యవహారాల్లో మోసానికి గురై తనువు చాలిస్తున్న పిల్లలూ లేకపోలేదు. వీరందరినీ భుజం తట్టి, ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చేవారే విద్యాసంస్థల్లో కరవయ్యారు. ఉదయం లేస్తే చదువు తప్ప మరో విషయాన్ని పట్టించుకోని ఉపాధ్యాయులు సైతం దీనికి బాధ్యత వహించాల్సిందే. ఆటపాటల వల్ల పిల్లల్లో మానసికోత్తేజం కలుగుతుందన్న సంగతి అందరికీ తెలుసు.

కానీ, ఆట స్థలాలు లేని పాఠశాలలే నేడు ఎక్కువయ్యాయి. కాంక్రీటు భవనాల్లో, సరైన వెలుతురు, గాలి లేని గదుల్లో బోధన జరుపుతూ ముక్కుపచ్చలారని పిల్లల్ని రోజుకు ఎనిమిదినుంచి పది గంటల సేపు బందీలుగా ఉంచుతున్న కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు కూడా ఈ పాపంలో భాగం ఉంది. పాఠ్యాంశాల బోధనే పరమావధిగా భావించే ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా కౌన్సెలర్ల నియామకాన్ని తప్పనిసరిగా చేపట్టాలంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తే ఈ సమస్యకు కొంతవరకూ పరిష్కారం దొరకుతుందనడంలో సందేహం లేదు. తమ మానసిక పరిస్థితిని కౌన్సెలర్లకు వివరించి, తగిన సలహాలు, సూచనలు పొందేలా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటూ, వారు విద్యాసంస్థల్లోనూ, సమాజంలోనూ తమకు ఎదురవుతున్న ఇబ్బందులను, అవమానాలనూ తమతో పంచుకునే వాతావరణం కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇండియాలో 15-24 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా మానసికమైన ఒత్తిడికి గురవుతున్నట్లు యునిసెఫ్ నివేదిక తేటతెల్లం చేస్తోంది.సాధారణంగా విద్యార్థులు పరీక్షలంటే ఒత్తిడికి, కుంగుబాటుకు గురవుతూంటారు. ఇలాంటి కొందరిలో ఆత్మహత్యా ధోరణి కూడా కనిపిస్తూ ఉంటుంది. వారిని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు గమనించి, మానసిక చికిత్స నిపుణుల వద్దకు తీసుకువెళ్లగలిగితే ప్రయోజనం ఉంటుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పడే టాస్క్‌ఫోర్స్ అయినా విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయగలిగితే అదే పదివేలు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News