అమెరికాలో స్కూళ్లు, కాలేజీల్లో కాల్పులు జరగడం సర్వసాధారణం. విద్యార్థులే తల్లిదండ్రుల గన్స్ తీసుకొచ్చి,తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడిన సంఘటనల గురించి విన్నాం. ఆ సంస్కృతి ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చినట్లుంది.
నోయిడాలో ఇద్దరు విద్యార్థులు తమ టీచర్ పైనే కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన పాఠశాల బయట జరిగింది. రకీబ్ హుస్సేన్ (26) అనే టీచర్ నోయిడాకు సమీపంలో సాకీపూర్ గ్రామంలోని స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయన బుధవారం ఉదయం స్కూలుకి వెళ్తుంటే 17 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులు ఆయనతో మాట్లాడేందుకు వచ్చారు. టీచర్ తో మాట్లాడుతూనే వారు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో రకీబ్ హుస్సేన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన చెవి పక్కనుంచి తూటా దూసుకుపోయింది. పోలీసులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి, నిందితులకోసం గాలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే వారు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.