Sunday, February 23, 2025

పిఈటి వేధింపులు..స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పిఈటి తనను కొట్టి తోటి విద్యార్థుల ముందు అవమానపరిచారని తీవ్ర మనస్థాపానికి గురైన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సాగర్ గ్రామర్ హై స్కూల్‌లో జరిగిన ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట బైఠాయింపు జరిపి ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగ్రహంతో స్కూల్ టీచర్లపై దాడికి ప్రయత్నించారు. దీంతో స్కూల్ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్కూల్ ఆస్తులకు పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్ ద్వారకనగర్‌లో నివసిస్తున్న నారాయణఖేడ్ సిద్ధగిరిగి ప్రాంతానికి చెందిన ముంగ ధర్మారెడ్డి,సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి (సాయి) (14) ఉప్పల్ న్యూ భారత్ నగర్ లోని సాగర్ గ్రామర్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

శుక్రవారం సాయంత్రం తరగతి గదిలో సిసి కెమెరాను పక్కకు జరిపాడన్న అభియోగంతో పిఇటి ఆ విద్యార్థిని మందలించాడు. మళ్లీ శనివారం ఉదయం తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు మందలించి చేయిచేసుకోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే వాష్ రూమ్‌కి వెళ్లి వస్తానని తరగతి టీచర్‌కు చెప్పి స్కూల్ భవనంలోని నాలుగో అంతస్తు పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తం మడుగులో పడి ఉన్న విద్యార్థిని వెంటనే స్కూల్ కరస్పాండెంట్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూలుకు చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పటికే రంగంలో దిగిన పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. పిఇటి ఆంజనేయులు, స్కూల్ కరస్పాండెంట్, టీచర్ల వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆత్మహత్యకు ముందు మిస్ యూ మమ్మీ అంటూ బుక్‌లో రాశాడని మృతుడి తల్లి సంగీత, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్తులు అమ్ముకొని పూసల వ్యాపారం చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను ఇదే స్కూల్ లో చదివించానని వాపోయారు.

పెద్ద కుమారుడు లింగారెడ్డి బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని, చిన్న కుమారుడు సంగారెడ్డి (సాయి) ఆత్మహత్యకు స్కూల్ యాజమాన్యమే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి విద్యార్థులు, ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, బిఆర్‌ఎస్‌వి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి రామారావు స్కూల్‌ను సందర్శించారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అంటూ స్కూల్‌ను సీజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజ్గిరి ఎసిపి చక్రపాణి ఆధ్వర్యంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి, మరికొందరు ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగి స్కూల్ ఆస్తులను ధ్వంసం చేయకుండా పటిష్టమైన బందోబస్తును నిర్వహించారు

. స్కూల్ లోపల భయంతో బిక్కుబిక్కు మంటున్న టీచర్లందరినీ పోలీసులు స్పెషల్ ఫోర్సు మధ్య క్షేమంగా ఇంటికి పంపించారు. తన కుమారుడు సాయి ఆత్మహత్యకు కారణమైన పిఈటి ఆంజనేయులు, క్లాస్ టీచర్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడు విద్యార్థి సాయి తండ్రి ధర్మారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. ఘటనకు కారణమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News