Tuesday, December 24, 2024

ఫీ’జులుం’తో రగిలిన అగ్గి

- Advertisement -
- Advertisement -

విద్యార్థి టిసి కోసం వచ్చి
పెట్రోల్ పోసుకున్న విద్యార్థి
నాయకుడు పక్కనే ఉన్న
దీపం అంటుకొని చెలరేగిన
మంటలు, తీవ్రగాయాలు
మంటలార్పేందుకు
యత్నించిన మరో ఇద్దరికి
గాయాలు డిఆర్‌డిఓ
ఆస్పత్రికి తరలింపు
కాలేజీ యాజమాన్యానికి జిల్లా
విద్యాశాఖ షోకాజు నోటీసులు
విచారణకు ఆదేశించిన
మంత్రి సబిత

మన తెలంగాణ /అంబర్ పేట: అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న ఎంపిసి విద్యార్థులు, మొదటి సంవత్సరం ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వలేమని కళాశాల ప్రిన్సిపాల్ ఘాటుగా సమాధానం చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రుల మధ్య వాగ్వా దం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి సంఘాల నాయకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కళాశాల సిబ్బంది, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… అంబర్‌పేటలోని ఒక కార్పొరేట్ కళాశాలలో ఎంపిసి రెండో సంవత్సరం పూర్తి చేసిన నారాయణస్వామితో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ సుధాకర్‌తో సర్టిఫికెట్ల విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకుడు సందీప్ (30), వెంకటాచారి (26)మరి కొంతమంది నాయకులు సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సర్టిఫికెట్ ఇవ్వమని ఘాటుగా సమాధానం చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి సంఘాల నాయకులు అప్పటికే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను సందీప్‌కు ఇచ్చారు.

దీంతో సందీప్ పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోబోయారు. ఈ నేపథ్యంలోనే దేవుని చిత్రపటం ముందు వెలుగుతున్న దీపంపై పెట్రోల్ పడడంతో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. సందీప్, వెంకటాచారికి మంటలు అంటుకొని వారు ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకోవడానికి వచ్చిన కళాశాల ఈఒ అశోక్‌రెడ్డికి సైతం మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన సిబ్బంది, విద్యార్థులు మంటలను అదుపులోకి తీసుకొచ్చి 108 అంబులెన్స్ సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు కార్పొరేటర్లు చేరుకోవడంతో కళాశాల సమీపంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబర్ పేట పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి ఈస్ట్ జోన్ డిసిపి సతీష్, అడిషనల్ డిసిపి శ్రీనివాస్‌రెడ్డిలు చేరుకొని దర్యాప్తు చేసి పూర్తి వివరాలు చెబుతానని వారు తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలింపు

అగ్నిప్రమాదంలో తీవ్రగాయాలైన విద్యార్థి నాయకుడు సందీప్‌కు 65శాతం, వెంకటాచారికి 30శాతం, ఏవో అశోక్ రెడ్డికి 50శాతం కాలిన గాయాలతో ఉన్నారు . వీరికి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రి నుంచి డిఆర్‌డిఓ అపోలో ఆస్పత్రికి తరలించి ఐసీయూలో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు.

అవాంఛనీయ ఘటనపై విద్యాశాఖ షోకాజ్ నోటీస్

బాగ్‌అంబర్‌పేటలోని ఓ కార్పోరేట్ కాలేజీలో అవాంఛనీయ ఘటన చో టుచేసుకుంది. శుక్రవారం ఉయదం చోటుచేసుకున్న ఈఘటనపై వెం టనే వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి జిల్లా విద్యాశాఖ షో కాజ్ నోటీసు జారీ చేసింది. కాలేజీ ప్రాంగణలో ఈ ఘటన ఎందుకు చోటుచేసుకుందో చెప్పాలని నోటీసులో పేర్కొంది. టిసి కోసం సాయి నారాయణ అనే విద్యార్థి కాలేజీకి వచ్చి పెట్రోల్ పోసుకొని ప్రిన్సిపాల్‌ను భయపెట్టడానికి ప్రయత్నించగా కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ దీపం వెలిగించి ఉండడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో విద్యార్థితో పాటు ప్రిన్సిపాల్, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్ జిల్లా విద్యాధికారి(డిఇఒ) కాలేజీని సందర్శించారు.అప్పటికే కాలేజీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటి వారినెవరినీ లోపలకు అనుమతించలేదు. దీంతో విద్యాధికారి పోలీసు అధికారిని వాకబు చే యగా ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు వారిని సికిందరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాలేజీ సిసి ఫుటేజికి సంబందించి హార్డ్‌డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాలేజీ వేధింపుల ఘటనపై పూర్తి స్థాయి విచారణ : సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఫీజు బకాయి చెల్లించాలని నగరంలోని ఓ కార్పోరేట్ కాలేజీ వేధింపుల ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక అందినవెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News