Sunday, January 19, 2025

ఓయూలో మీడియాపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ లైబ్రరీ వద్ద మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. డిఎస్‌సి అభ్యర్థుల ఆందోళనను కవరేజీ కోసం వెళ్ళిన రిపోర్టర్ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు. విలేకరి చొక్కాపట్టుకొని లాక్కెళ్ళారు. తను జర్నలిస్టునని, తన పని తాను చేసుకుంటున్నానని, మీ పని మీరు చేసుకోవాలని చెబుతున్నా పట్టించుకోకుండా పోలీసులు ఆ రిపోర్టర్‌ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి పోలీసులు తమ పైత్యాన్ని ప్రదర్శించారు.

పోలీసుల వైఖరి దారుణం : టిజెఎఫ్
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును టిజెఎఫ్ తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తలు కవర్ చేయడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయటమేంటని ప్రశ్నించింది. కనీసం మీడియా ప్రతినిధులు అనే సోయి లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అవుతుందని విమర్శించింది. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మహేశ్వరం మహేంద్ర డిమాండ్ చేశారు.

సచివాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన
జర్నలిస్టులపై పోలీసుల దాడులను మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పోలీసుల వైఖరికి నిరసనగా సచివాలయం మీడియా పాయింట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయ డం, వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్చను హరించడమేనని మండిపడ్డారు. ఓయూలో కవరేజీకి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్, వీడియో జర్నలిస్టును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు.

పోలీసులపై చర్య తీసుకోవాలి
జర్నలిస్టులపై దాడికి పాల్పడి జి న్యూస్ ప్రతినిధిని,వీడియో జర్నలిస్టులని ఓయూ పిఎస్ కి తరలించిన పోలీసులపై డిజిపి చర్య తీసుకోవాలని డిజిటల్ మీడియా అసోసియేషన్ డిమాండ్ చేసింది. పోలీసుల చర్యను అసోసియేషన్ ఉపాధ్యక్షులు పురుషోత్తం తీవ్రంగా ఖండించారు.

జర్నలిస్టు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం : టియుడబ్లుజె
ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్‌సి వాయిదా వెయ్యాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే. దానిని కవర్ చెయ్యడానికి వెళ్లిన జీ న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు అరెస్టు చేయడం హేయనీయమని టియుడబ్లుజె ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించుకొని పోలీసు స్టేషన్‌లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని విమర్శించింది.

తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లాగా పోలీస్ రాజ్యం వచ్చిందా అనే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని టియుడబ్లుజె అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టిఇఎంజెయు అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. రమణకుమార్ అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడిచిపెటాలని, పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News