Saturday, July 6, 2024

లీకైన ప్రశ్నపత్రం నాకు దొరికింది

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి 2024 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం గురువారం కొత్త మలుపు తిరిగింది. పరీక్ష జరిగిన రోజుకు ముందు రోజు రాత్రే తనకు జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసే తన మేనమామ నుంచి ప్రశ్నాపత్రం అందినట్లు ఈ కేసులో అరెస్టయిన నలుగురు విద్యార్థులలో ఒకరు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. బీహార్ నుంచి అరెస్టు చేసిన నలుగురు విద్యార్థులలో ఒకడైన అనురాగ్ యాదవ్ తన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అనురాగ్ యాదవ్(22) ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. బీహార్‌లోని దానాపూర్ పట్టణ కౌన్సిల్(దానాపూర్ నగర పరిషద్)లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన మేనమాన సికందర్ ప్రసాద్ యోదవేందు తనకు ఫోన్ చేసి రాజస్థాన్‌లోని కోటా నుంచి వాపసు వచ్చెయ్యాలని చెప్పాడు. నీట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని ఆయన తనకు తెలిపాడు. దీంతో తాను కోటా నుంచి తిరిగివచ్చేశానని, తన మేనమామ తనను అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల వద్దకు 2024 మే 4వ తేదీ రాత్రి తీసుకువెళ్లాడని అనురాగ్ తెలిపాడు.

తనకు అక్కడ నీట్ ప్రశ్నాపత్రం, జవాబు పత్రం రెండూ ఇచ్చారని, అవి తీసుకుని తన ఇంటికి వచ్చి రాత్రంతా వాటిని చదువుతూ బట్టీ పట్టానని అతను తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరుసటి రోజు పరీక్షలో యథాతథంగా అవే ప్రశ్నలు వచ్చాయని అతను తెలిపాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు తనను అరెస్టు చేశారని, తాను తన నేరాన్ని ఒప్పుకున్నానని అతను తెలిపాడు. కాగా..అనురాగ్ యాదవ్‌తోపాటు అరెస్టయిన సికందర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను ఏ పోటీ పరీక్షకు చెందిన ప్రశ్నాపత్రాన్నయినా లీక్ చేయగలమని నిందితులు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ తనకు చెప్పారని పేర్కొన్నాడు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే ప్రతి అభ్యర్థికి రూ. 30 లక్షల నుంచి 32 లక్షల వరకు ఖర్చవుతందని వారిద్దరూ తన తో అన్నారని అతను తెలిపాడు. దీనికి తాను అంగీకరించి పరీక్ష పాసవ్వడానికి నలుగురు అభ్యర్థులకు సాయం చేయాలని తాను కోరానని, మే 4వ తేదీ రాత్రి ఆ నలుగురిని నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ వద్దకు తీసుకెళ్లానని, ప్రశ్నాపత్రాన్ని ఆ ఇద్దరూ ఇచ్చారని సికందర్ తెలిపాడు.

దురాశతో తాను ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 30 లక్షలకు బదులుగా రూ. 40 లక్షలు తీసుకున్నానని సికందర్ వెల్లడించాడు. కాగా..నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతవారం ఖండించారు. ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News