జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని ఆదర్శ కళాశాలలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మండలంలోని సూరారంకు చెందిన కాసర్ల ప్రసన్న జాతీయ స్థాయి కళోత్సవానికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ దేవులపల్లి శ్రీకాంత్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 7న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రసన్న ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి అర్హత సాధించిందన్నారు. పేదరికంలో ఉన్న గ్రామీణ విద్యార్థుల్లో ఎంతో కళా ప్రతిభ దాగి ఉందన్న జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ప్రసన్నను అభినందించి సన్మానం చేశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కొరారు.
పాఠ్యాంశాలతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, పిజిటి డా మహేందర్, వైస్ ప్రిన్సిపాల్ డా జానీ నాయక్‌ను కలెక్టర్ అభినందించారు. సమాజంలో మహిళల పట్ల చూపుతున్న వివక్ష, ఆడపిల్లలు పుట్టారని నవజాత శిశువుల్ని చంపేయడం జరుగుతుంది. అలాంటి యదార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన ఏక పాత్రాభినయవ ప్రదర్శనలో రాష్ట్ర స్థాయి న్యాయ నిర్ణేతలను కన్నీరు పెట్టించి తన్మయత్వం పొందేలా నటించడం గొప్ప విషయం అని రాష్ట్ర కళోత్సవ కార్యక్రమ నిర్వహకులు ప్రసన్నను అభినందించినట్లు తెలిపారు.