డిగ్రీలు పొదిన విద్యార్థులు ఉద్యోగాలు కల్పించేలా మారాలి
జెఎన్‌టియుహెచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై
మనతెలంగాణ/హైదరాబాద్ : జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. విద్యార్థులు చిన్న చిన్న వైఫల్యాల వద్ద నిరాశ చెందవద్దని ఉద్బోధించారు. ఎప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని అన్నారు. సమస్యలను ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. శనివారం కూకట్‌పల్లిలోని జెఎన్‌టియుహెచ్ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, డిగ్రీలు పొందిన విద్యార్థులు ఉద్యోగం వెతుక్కునే వారిలా కాకుండా… ఉద్యోగాలు కల్పించేలా మారాలని గవర్నర్ అన్నారు. యువతలో ఒత్తిడి పెరుగుతోందని, చిన్న సమస్యలను కూడా తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మరువకూడదని చెప్పారు. భారతదేశాన్ని స్వావలంబన దేశంగా మార్చేందుకు విద్యారంగంలో సర్వతోముఖ ఆవిష్కరణలు జరగాలని పిలుపునిచ్చారు.
జెఎన్‌టియుహెచ్ వంటి సాంకేతిక విశ్వవిద్యాలయాలు ప్రపంచ భవిష్యత్తును నిర్వచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో అగ్రగామిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాలు గ్లోబల్ ఫ్యాకల్టీని ఆకర్షించాలని, వివిధ రంగాలలో వేగంగా మారుతున్న గ్లోబల్ డైనమిక్స్‌కు అనుగుణంగా వారి పాఠ్యాంశాలను పునరుద్ధరించాలని చెప్పారు. విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకత సామర్థ్యాలు చాలా కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అదే విధంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మందికి బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్సలర్ కె. నర్సింహారెడ్డి, రెక్టార్ ఎ.గోవర్ధన్, రిజిస్ట్రార్ ఎం. మంజూర్ హుస్సేన్, సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.