కోట (రాజస్థాన్) : ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన మొహ్మద్ జైద్ (19) అనే విద్యార్థి కోట హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోట లోని న్యూ రాజీవ్ గాంధీనగర్ ఏరియా హాస్టల్‌లో ఈ సంఘటన జరిగింది. మృతుడు నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. కోటలో విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఈ ఏడాది ఇదే మొదటి సంఘటన. పోలీస్‌లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. మృతుని తల్లిదండ్రులు వచ్చిన తరువాత పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారు.
జిల్లా లోని హాస్టళ్లకు సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఈ హాస్టల్ ఫ్యాన్‌కు యాంటీ సూసైడ్ పరికరాన్ని అమర్చలేదని కోట హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ ఆరోపించారు. హాస్టల్‌ను సీజ్ చేయాల్సిందిగా జిల్లా అధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు విద్యార్థి మొహ్మద్ జైడ్ గది నుంచి బయటకు రాకపోవడంతో రాత్రి 10 గంటలకు హాస్టల్ వార్డెన్ తమకు ఫిర్యాదు చేశారని జవహర్‌నగర్ ఏరియా డిఎస్‌పి భవానీ సింగ్ చెప్పారు. హాస్టల్ గదిలో సూసైడ్ నోట్ ఏదీ దొరకలేదన్నారు. దర్యాప్తులో ఆత్మహత్యకు కారణాలు తెలుస్తాయని తెలిపారు.