Thursday, January 16, 2025

మెతుకు ముట్టని విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

బాసర ట్రిపుల్ ఐటిలో శనివారం అర్ధరాత్రి
నుంచి కొనసాగుతున్న ఆందోళన మెస్
కాంట్రాక్టుల రద్దుకు స్టూడెంట్ల పట్టు
ఇన్‌చార్జి విసి దౌత్యం విఫలం హైదరాబాద్‌లో
మంత్రి సబిత ఇంటి వద్ద తల్లిదండ్రుల నిరసన

మన తెలంగాణ/బాసర: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ శనివారం రాత్రి నుంచి విద్యార్థులు మెతుకు ముట్టకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్శిటీ ఇన్‌చార్జి విసి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ విద్యార్థులకు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ రోజున్నర పూట భోజనం, అల్పాహారం చేయకుండా మౌనంగానే ఆందోళన చేస్తున్నారు. తాజాగా టెండర్లకు పిలిచామని ఓపికగా ఉండాలని ఇన్‌చార్జి విసి చెప్పినా విద్యార్థులు పట్టు వీడటం లేదు. కాగా, తాజాగా క్యాంపస్‌లో మెస్‌లో పుడ్ పాయిజన్ కలకలం రేపడం, పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి విద్యార్థుల ఆగ్రహానికి కారణంగా కన్పిస్తోంది. దీంతో శనివారం రాత్రి ఈ1, ఈ2 విద్యార్థులు మెస్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి భోజనం సైతం చేయకుండా భీష్మించుకుకూర్చున్నారు. మెస్‌లో మొదలైన ఆందోళన అర్థర్రాతి 2గంటల సమయంలో మెస్ నుంచి బైటకు వచ్చిన విద్యార్థులు హాస్టల్‌కు వెళ్లిపడుకున్నారు. తిరిగి ఆదివారం యథావిధిగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్శిటీ ఇన్‌చార్జి విసి, డైరెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామని ఎంతగా నచ్చజెప్పినా విద్యార్థులు శాంతించడం లేదు.

పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఆందోళన విరమించేదిలేదని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మెస్‌లలో కాంట్రాక్టర్ పెడుతున్న భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని, ఇప్పటికే ఒక విద్యార్థి మృతి చెందాడని, వరంగల్‌కు చెందిన మరో విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విద్యార్థులు వాపోతున్నారు. మెస్ కాంట్రాక్టర్ల వ్యవహారం, ఆహారం నాణ్యతపై ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారుల్లో చలనంలేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేయాలని, కొత్తగా కాంట్రాక్టర్లను నియమించి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంతగా కోరినా ఫలితంలేదని విద్యార్థులు అంటున్నారు. కాగా, దీనిపైనే గత నెలలో వారం రోజులపాటు విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 17వ తేదీన వర్శిటీ ఇన్‌చార్జి విసీతో విద్యార్థులు చర్చల సందర్భంగా పుడ్ పాయిజన్‌కు కారణమైన మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలని, 24వ తేదీలోపు పూర్తిస్థాయి విసిని నియమించాలని తదితర 12 డిమాండ్లపై డెడ్‌లైన్ పెట్టారు. లేనిపక్షంలో 25నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై అప్పట్లో అధికారులు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అధికారులు ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది విద్యార్థులకు కంటగింపైంది. తమ సమస్యలు పరిష్కరించకుండా, వర్శిటీకి సెలవులు ఇవ్వడంపై మండిపడ్డారు.

ఎంపి సోయం బాబూరావు అరెస్ట్

కాగా, ఐటీ విద్యార్థులను పరామర్శించించేందుకు వెళుతున్న ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావును పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం భోజనం సైతం మానేసి విద్యార్థులు నిరసన చేయడంతో వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని ఎంపి ప్రకటించారు. లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామం వద్ద ఎంపి బాపురావు వాహనాన్ని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లే మార్గంలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వైపునకు రాజకీయ పార్టీ నేతలను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బాసరలో సై తం ట్రిపుల్ ఐటీ చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా బిజెపి కార్యకర్తలు ప్రధాన గేటు ముట్టడించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి బాసర్ పోలీస్టేషన్‌కు తరలించారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర వి ద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీని ఇప్పటివరకూ ఎందుకు నేరవేర్చలేదని ప్రశ్నించారు. ఫలితంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News