Saturday, December 21, 2024

పెరుగుతున్న డ్రాపౌట్స్

- Advertisement -
- Advertisement -

బడి మానేస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5 స్థానంలో వుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్‌సభలో కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2021- 22 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల అత్యధిక డ్రాపౌట్స్ ఒడిశాలో 49.9 ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బీహార్ (42.1), మేఘాలయ (33.5), కర్నాటక (28.5), ఆంధ్రప్రదేశ్, అసోం (28.3)లు నిలిచాయి. వీటి తరువాత స్థానంలో గుజరాత్ (28.2), తెలంగాణ (27.4) వున్నాయి. దక్షిణాదిలో తమిళనాడులో అతితక్కువ (9.0) డ్రాపౌట్స్ నమోదైంది. కేరళలో ఇది 11.2 వరకు ఉంది. చండీగఢ్, మణిపూర్‌లో జీరో డ్రా పౌట్స్ నమోదైంది. ఎపిలో 2018-19లో 25% మేర ఉన్న ఈ రేటు 2020- 21లో ఏకంగా 31.3 శాతానికి పెరిగింది. 2022లో ఎపిలో 69,941 మంది పదో తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టెన్త్ క్లాస్ పరీక్షలు ఉత్తీర్ణులు కాని విద్యార్థుల సంఖ్య తెలంగాణలో 2019లో 27,458 మేర ఉండగా.. 2022లో ఆ సంఖ్య 12,325కి తగ్గింది.

మరో వైపు ఆశ్చర్యకరంగా దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల నుంచి గడచిన అయిదేళ్లలో 13 వేల మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థులు చదువుకు మధ్యలో ఆపేసి బయటకొచ్చేశారు. ఇటీవల లోక్‌సభలో బిఎస్‌పి సభ్యుడు రూపేశ్ పాండే అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానమిస్తూ ఈ సంగతి వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా భావించే ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్శిటీల నుంచి అందిన డేటా ప్రకారం 4,596 మంది ఒబిసి విద్యార్థులు, 2,424 మంది ఎస్‌సి, 2622 మంది ఎస్‌టి విద్యార్థులు సెంటల్ యూనివర్శిటీల నుంచి ఈ అయిదేళ్లలో డ్రాపౌట్ అయ్యారు. ఐఐటిల నుంచి 2,066 మంది ఒబిసి విద్యార్థులు, 1,068 మంది ఎస్‌సి విద్యార్థులు, 408 మంది ఎస్‌టి విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేయకుండానే వెళ్లిపోయారు. ఐఐఎంలలో 163 మంది ఒబిసి విద్యార్థులు, 188 మంది ఎస్‌సిలు, 91 మంది ఎస్‌టి విద్యార్థులు డ్రా పౌట్ అయ్యారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డ్రాపౌట్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం తన వద్ద లేదని మంత్రి తెలిపారు.

ఈ డ్రాపౌట్స్‌కు కారణం విద్యార్థుల పేదరికమేనని ఆయన తెలిపారు. ఆదే విధంగా 2019 నుండి 2021 మధ్య కాలంలో దాదాపు 35 వేల మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని కేంద్రం తెలిపింది. దేశానికి యువతే వెన్నుముక. వారు ఎంతో కష్టపడి చదివి, పేదరికం లేదా ఇతర కారణాల వల్ల ఉన్నత విద్యకు దూరం అవుతుండడం విచాకరం. కేవలం పేదరికం ఒక్కటే కాకుండా, కుల వివక్షకు గురవడం, మానసిక ఒత్తిడి వంటివి కూడా ఇందుకు కారణం అవ్వొచ్చని విద్యారంగ నిపుణులు అంటున్నారు. అలాగే చదువుకున్న వారికి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉన్నత విద్యాలయాల్లో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్థాయిలో మధ్యలో ఉన్నత విద్యకు దూరం అవడంపై సరైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకుగాను పాలక వర్గాలు లోతైన విశ్లేషణ చేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు లక్ష్యాలు ఆశించిన స్థాయిలో నెరవేరవు.

యం.రాం ప్రదీప్
9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News