Friday, November 22, 2024

కంప్యూటర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

Students' first priority is computer science

– టాప్‌టెన్ కళాశాలల్లో చేరేందుకు మొగ్గు
– ఆప్షన్ల నమోదుకు ఈ నెల 16 చివరి తేదీ
– 18న మొదటి విడత సీట్ల కేటాయింపు

హైదరాబాద్ : ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర ప్రవేశాల్లో విద్యార్థులు కంప్యూటర్ ఇంజనీరింగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సాఫ్ట్‌వేర్, ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటుండంతో సిఎస్‌ఇ బ్రాంచికే తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సిఎస్‌ఇ) బ్రాంచిని వెబ్ ఆప్షన్లుగా నమోదు చేసుకున్నారు. సిఎస్‌ఇ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజి(ఐటి), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్(ఇసిఇ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బ్రాంచిలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంజనీరింగ్‌లో చాలా బ్రాంచీలు అందుబాటులో ఉన్నప్పటికీ మిగతా బ్రాంచీలలో చేరేందుకు ససేమిరా అంటున్నారు. కొందరైతే కంప్యూటర్ సైన్స్ సీటు లభిస్తేనే ఇంజనీరింగ్ చేయాలి లేదంటే సాధారణ డిగ్రీలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కన్వీనర్ కోటాలో సిఎస్‌ఇలో సీటు లభించకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటాలో సుమారు రూ.7- నుంచి రూ.9 లక్షల వరకు డబ్బులు వెచ్చించి కంప్యూటర్ సైన్స్ చేసేందుకు సిద్దమవుతున్నారు. డిమాండ్ లేని కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు.

టాప్‌టెన్ కళాశాలలకే మొగ్గు

ఇంజనీరింగ్ బ్రాంచీల ఎంత కీలకమో… కళాశాల ఎంపిక కూడా అంతే కీలకంగా మారింది. ఎందుకంటే టాప్ టెన్ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను టాప్‌టెన్ కళాశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణ కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నా ఆ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ససేమిరా అంటున్నారు. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్‌కే విద్యార్థులు మొదటి ప్రాధాన్యత ఇస్తుండగా, రెండవ ప్రాధాన్యత ఇసిఇకి ఇస్తున్నారు. మెకానికల్, ఇఇఇ, సివిల్ తదితర బ్రాంచీల పరిస్థితి గత ఏడాది ఉన్నట్లుగానే ఉంది.

ఎంసెట్‌లో తమకు లభించిన ర్యాంకుకు కన్వీనర్ కోటా కింద టాప్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ సీటు లభించదని భావిస్తున్న విద్యార్థులు యాజమాన్య కోటా కింద అయినా ఆ బ్రాంచీలో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు కూడా డొనేషన్లు చెల్లించి ఆ బ్రాంచీలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.కొందరు విద్యార్థులు పేరున్న ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాప్ కళాశాలల్లో బి కేటగిరీ కోటా కంప్యూటర్ సైన్స్ సీట్లు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. బీ కేటగిరీలో టాప్ 10 కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్‌కు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటుండగా, ద్వితీయ శ్రేణి కళాశాలల్లో రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నట్లు తెలిసింది.

16 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను సోమవారం వరకు నిర్వహించనున్నారు. దాంతోపాటు స్లాట్ బుకింగ్, కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపుకు కూడా నెల 13 వరకు అవకాశం కల్పించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News