Sunday, April 20, 2025

విద్యార్థులకు వేసవి సెలవులు ఓ సదవకాశం

- Advertisement -
- Advertisement -

వేసవికాలం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక విశిష్టమైన సమయం. వేసవిలో పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులకు తమ పిల్లలతో సమయం గడపడానికి, వారి భవిష్యత్తును ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. వేసవి సెలవులు విద్యార్థులకు విశ్రాంతిని, వినోదాన్ని, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాన్ని అందిస్తాయి. అయితే, తల్లిదండ్రులకు ఈ సమయం తమ పిల్లల అభివృద్ధిలో కీలకమైన బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలను ఈ సెలవుల కోసం పెట్టుకోవాలి. నేను ఈ సెలవుల్లో ఏమి నేర్చుకోవాలి? నేను కొత్తగా ఏమి అభివృద్ధి చేసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాల శోధనలో ఉండాలి. సెలవులు ముగిసే సరికి ఒక మంచి మార్పు రావాలి.

అది జ్ఞానంలో కావొచ్చు, నైపుణ్యంలో కావొచ్చు లేదా వ్యక్తిత్వ వికాశంలో కావొచ్చు. వేసవి సెలవులు విద్యార్థులకు ఒక బహుమతి. సంవత్సరం పొడవునా అధ్యయన ఒత్తిడి, హోం వర్క్, పరీక్షలతో బిజీగా గడిపే విద్యార్థులకు ఈ సెలవులు విశ్రాంతిని అందిస్తాయి. ఈ సమయంలో వారు తమ ఆసక్తులను అన్వేషించవచ్చు. కొత్త హాబీలను అభివృద్ధి చేసుకోవచ్చు, స్నేహితులతో సమయం గడపవచ్చు. ఉదాహరణకు, కొందరు విద్యార్థులు ఈ సమయంలో సంగీతం, నృత్యం, చిత్రకళ వంటి కళలను నేర్చుకుంటారు, మరికొందరు క్రీడలలో పాల్గొంటారు. జట్టుగా కలిసి ప్రాజెక్ట్లు చేయడం, సైంటిఫిక్ ఎగ్జిబిషన్లు సిద్ధం చేసుకోవడం, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా కొత్త పరిజ్ఞానం పొందడం, ఈ డిజిటల్ యుగంలో కోడింగ్, గ్రాఫిక్ డిజైన్ కంటెంట్ రైటింగ్‌లపై పట్టు సాధించవచ్చు.

ఈ కార్యకలాపాలు వారి సృజనాత్మకతను, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. అదే సమయంలో వేసవికాలం విద్యార్థులకు విద్యాపరమైన లక్ష్యాలను సమీక్షించడానికి, బలహీనమైన అంశాలను మెరుగుపరచుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు, గణితంలో బలహీనంగా ఉన్న విద్యార్థి వేసవికాలంలో ట్యూషన్‌లో చేరి తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. అదే విధంగా సైన్స్‌లో బొమ్మ లు గీయడం నేర్చుకోవడం, ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యానాలు పెంచుకోవడం. ఫ్రెంచ్, జెర్మనీ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడం మంచిది. వేసవి సెలవులు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తల్లిదండ్రుల పాత్రచాలా కీలకం. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గదర్శనం అందించాలి.

వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృథా చేయకుండా, ఉత్పాదక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఒక రోజువారీ షెడ్యూల్‌ను రూపొందించవచ్చు. ఇందులో అధ్యయనం, ఆటలు, విశ్రాంతి సమతుల్యంగా ఉండేలా చూడవచ్చు. అదనంగా, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సమయం గడపడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న పర్యటనకు వెళ్లడం, గ్రామీణ ప్రాంతాలను సందర్శించడం వంటివి పిల్లలకు కొత్త అనుభవాలను అందిస్తాయి. తల్లిదండ్రులు వేసవి కాలంలో పిల్లలకు కొత్త నైపుణ్యాలను నేర్పించడంలో కూడా పాలుపంచుకోవచ్చు. ఉదాహరణకు, ఒక తండ్రి తన పిల్లలకు సైకిల్ నడపడం లేదా చెక్క పనిని నేర్పవచ్చు, పొలాలు, ప్రకృతి అంశాలు. అదే విధంగా తల్లి వంట, కుట్టు వంటి జీవన నైపుణ్యాలను నేర్పవచ్చు.

ఇటువంటి కార్యకలాపాలు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను పెంపొందిస్తాయి. అదనంగా తల్లిదండ్రులు పిల్లలను సామాజిక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు, స్థానిక సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా పిల్లలు సామాజిక బాధ్యతను నేర్చుకుంటారు.వేసవి కాలంలో ఒక సమస్య ఏమిటంటే, కొందరు విద్యార్థులు సెలవుల సమయాన్ని ఎక్కువగా మొబైల్ ఫోన్‌లు, వీడియో గేమ్‌లతో గడపడం. ఇది వారి ఆరోగ్యంపై, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి తల్లిదండ్రులు స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయాలి, పిల్లలను బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. అదనంగా, పిల్లలకు పుస్తకాలు చదవడం, రాత పనులు అలవాటు చేయడం ద్వారా వారి జ్ఞానాన్ని, ఊహాశక్తిని పెంపొందించవచ్చు.

తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చదవడం ద్వారా ఈ అలవాటును మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. మరోవైపు, వేసవికాలం తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి అనువైన సమయం. ఈ సమయంలో వారు పిల్లలతో వారి కెరీర్ లక్ష్యాల గురించి చర్చించవచ్చు.వారి ఆసక్తులను అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక విద్యార్థి వైద్యరంగంలో ఆసక్తి చూపితే, తల్లిదండ్రులు అతన్ని స్థానిక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకుడిగా చేర్చవచ్చు. తద్వారా అతను ఆ రంగం గురించి ఆచరణాత్మక జ్ఞానం పొందవచ్చు. పిల్లలను ఒంటరిగా ఈతలకు పంపకూడదు, బైక్ రైడింగ్ చేయించకూడదు, అనవసరమైన విషయాలకు స్నేహితులతో తిరగనీయకూడదు. ఈ విషయాలపట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్త వహించాలి. పిల్లలకు సరైన మార్గదర్శనం అందించడం ద్వారా పిల్లలకు వారి శారీరక, మానసిక, విద్యాపరమైన అభివృద్ధితో పాటు మరుపురాని అనుభవాలను వారు మూటగట్టుకుంటారు.

ఎల్. ఉపేందర్
99494 92677

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News