Tuesday, January 21, 2025

ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట లో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 12 మంది పదవ తరగతి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే…బుదవారం ఉదయం హాస్టల్‌లో అల్పాహారం తిని పాఠశాలకు వెళ్లగా కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. ఒక్కొక్కరుగా 12 మంది వాంతులు చేసుకోవడంతో వెంటనే ఉపాధ్యాయులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ సైతం స్పందించి వెంటనే ఆసుపత్రిలో ఉన్న విద్యార్థినులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, హాస్టల్‌లో అల్పాహారం తిన్న తరువాతనే వాంతులు అయినట్లు విద్యార్థినులు ఆరోపిస్తుండగా.. అల్పాహారం నాణ్యతగానే ఉన్నట్లు నిర్వాహకులు చెప్పడం గమనార్హం.

ఫుడ్ పాయిజన్ విషయమై డిటిడివో మడావి గంగారాంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఇదే విషయమై పాఠశాల వార్డెన్ లక్ష్మీరాజంను వివరణ కోరగా బుధవారం ఉదయం మొత్తం 160 మంది విద్యార్థినులు అల్పాహారంగా కిచిడీ తీసుకున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆటో, కారులో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. కాగా, తమ ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళనకు గురికావద్దని, తాము బాగానే ఉన్నామని, ఉపాధ్యాయులు, డాక్టర్లు తమను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు మేసేజ్‌లు పంపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News