Monday, December 23, 2024

బలవన్మరణాలు ఆగేదెన్నడు?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు విద్యార్థి వర్గాలను, పౌర సమాజాన్ని తీవ్రమైన ఆందోళనలకు గురిచేస్తున్నది. ఒకనాడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే అధికంగా జరిగిన ఇటువంటి తరహా ఘటనలు నేడు నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు సైతం విస్తరించాయి. ఇటీవల సూర్యాపేట జిల్లాలోని గురుకుల పాఠశాలలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అంతకముందు భువనగిరి జిల్లాలోని గురుకులంలో ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం, కామారెడ్డి జిల్లాలోని గురుకులంలో ఒక విద్యార్ధి, మహబూబ్‌నగర్ గురుకులంలో మరొక విద్యార్ధి, హైదరాబాద్‌లో ప్రైవేటు కళాశాలలో ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు ఇంటర్మీడియేట్ విద్యార్థులు, వరంగల్ ప్రైవేటు యూనివర్శిటీలో ఒక విద్యార్థిని, నాణ్యమైన సాంకేతిక విద్య ప్రభుత్వ విద్యాలయాల్లోని పేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన బాసర ట్రిపుల్ ఐటీలో గత ఏడాది నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, గత సంవత్సరం ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత 8 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు చూస్తుంటే విద్యార్థులు ఎంతటి

మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఎదురవుతున్న సమస్య కాదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఏటా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగి పోతున్నది. జాతీయ నేర నమోదు విభాగం- 2023లో వెల్లడించిన గణాంకాల ప్రకారం ఒక్క 2022 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా 10 వేలకు పైగా 18 సంవత్సరాల లోపు చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో జరిగిన ఆత్మహత్యల్లో దాదాపు 8% విద్యార్థులవే. పైగా ఇందులో దాదాపు 24% మంది విద్యార్థులు 9-, 10వ తరగతిలోపు చదువుతున్న చిన్నారులే. ఈ గణాంకాలు దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారో తెలియపరుస్తున్నవి. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలలో విద్యార్థి ఆత్మహత్యలు సైతం ఒకటి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల్లో కౌన్సిలర్ల నియామకానికి సంబంధించిన అంశం మరొక్కసారి తెర మీదకు వచ్చింది. సమాజ ప్రగతిలో విద్యారంగం పాత్ర అతి ప్రధానమైంది. భవిష్యత్ సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా మానవ వనరులను అభివృద్ధి పరచడం విద్యా సంస్థల ప్రధాన బాధ్యత. ప్రాథమిక స్థాయిలో అందుకు సంబంధించిన బీజాన్ని విద్యార్థుల్లో నాటడంలో పాఠశాలలు కీలక భూమిక పోషిస్తాయి.

కానీ ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యల్లో అత్యధికులు పాఠశాల స్థాయి విద్యార్థులు, 18 సంవత్సరాల లోపు ఉన్న వారే ఉంటున్నారు. తెలిసీ తెలియని వయసులో ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన ప్రతీసారి అది రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రమయ్యిందే తప్ప అందుకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేసి, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంలో వ్యవస్థలు వైఫల్యం చెందాయి అనడంలో సందేహం లేదు. విద్యార్థుల్లో ఆత్మహత్యలకు గల ప్రధాన కారణం ఒత్తిడిని జయించలేకపోవడం అని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ప్రస్తుతం విద్యా బోధన విద్యార్ధి కేంద్రంగా జరగడం లేదనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు తమ మార్కెట్‌ను మరింతగా విస్తరించుకోవడం కోసం మార్కులు, ర్యాంకులే ధ్యేయంగా విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. తమ పిల్లలు మెరుగైన ఉద్యోగాల్లో స్థిరపడాలనే కోరికతో తల్లిదండ్రులు సైతం అందుకు సహకరిస్తున్నారు.

కానీ విద్యార్థులు పడుతున్న మనోవేదనను ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మెరుగైన ఫలితాలు రాకపోతే ఏమంటారో అని కొందరు, తల్లిదండ్రులు తమపై పెంచుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నాం అని మరీ కొందరు ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, భరోసా కల్పించే వారు లేక అంతర్గత సంఘర్షణకు లోనవుతూ చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే కేవలం విద్యారంగ సమస్యలు మాత్రమే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కాదు.
మారుతున్న పరిస్థితుల్లో వారి కుటుంబ నేపథ్యం, సామాజిక, ఆర్ధిక స్థితిగతులు విద్యార్ధుల్లో మానసిక ఆందోళనకు కారణాలు అవుతున్నాయి. విద్యార్థుల్లో మానసిక సంఘర్షణలను తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విద్యా సంస్థలు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనబడుతున్నాయి. చాలా వరకు విద్యాసంస్థల్లో తాత్కాలికంగా మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారే తప్ప స్థిరమైన ప్రణాళికలపై దృష్టి సారించడం లేదు. మారుతున్న పరిస్థితిలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను మాత్రమే పాఠ్యప్రణాళికల్లో చేరుస్తూ సామాజిక అంశాలు, మానవీయ విలువలు, జీవన నైపుణ్యాలు వంటి నిజజీవితానికి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీంతో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, భావోద్వేగాలకు లోనవుతూ అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులపై నిత్యం పర్యవేక్షణ అవసరం. అప్పుడే విద్యార్థుల సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి పరిష్కార మార్గాలను చూపగలుగుతాం. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడంలో, మెరుగైన ఫలితాలను సాదించేలా వారిని ప్రేరేపించడంలో కౌన్సిలర్లు ప్రధానమైన భూమిక పోషిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మధ్య వారధిగా కౌన్సిలర్లు వ్యవహరిస్తారు. 2019లో ఇంటర్ ఫలితాల తర్వాత 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అన్ని జూనియర్ కళాశాలల్లో కౌన్సిలర్లను నియమించుకోవాలని ఆదేశించినప్పటికీ అది అమలుకు మాత్రం నోచుకోలేకపోయింది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులే కేంద్రంగా విద్యా భోధన జరిగేలా విధానాలను రూపొందించి అమలు పరచాలి. జీవన నైపుణ్యాలు,

మానవీయ విలువలతో కూడిన అంశాలను పాఠ్యంశాలలో చేర్చి ప్రాథమిక దశ నుండే స్వతహాగా తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసినప్పుడే విద్యార్థుల సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుంది. విద్యార్థుల్లో మానసిక సంఘర్షణలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం ద్వారా చాలా వరకు విద్యార్థి ఆత్మహత్యలను నివారించగలుగుతాము. అందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో సామాజిక, మానసిక అంశాలపై అవగాహన కలిగిన సోషల్ వర్కర్లను, మానసిక నిపుణులను కౌన్సిలర్లను నియమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం, విద్యా శాఖ చర్యలు చేపట్టాలి. అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని, దేశాన్ని చూడగలుగుతాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News