Sunday, September 29, 2024

ఉద్యోగాల్లో పనిఒత్తిళ్లే ఉరితాళ్లా!

- Advertisement -
- Advertisement -

పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులు తాము ఉత్తీర్ణులవుతామో లేదో అన్న టెన్షన్‌తో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలకు రాజస్థాన్‌లోని కోట కోచింగ్ సెంటర్లు సంచలనం కలిగించాయి. అలాగే ఉద్యోగం రాక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల హృదయ విదారక గాథలు కూడా దేశంలో జరుగుతున్నాయి. అయితే ఉద్యోగంలో కొన్ని లక్షల వేతనాలు పొందుతున్నా, ప్రోత్సాహకాలు అందుకుంటున్నా పని ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కార్పొరేట్ ఉద్యోగుల విషాద గాథలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

కార్పొరేట్ ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు.. ఆహా! జీవితాలకు ఏం ఢోకా లేదు. బోలెడు సంపాదన ఈ విధంగా మురిసిపోతుండటం సహజం. కానీ ఆ ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ప్రాజెక్టుల లక్షాలను నెరవేర్చడంలో క్షణం తీరిక లేక ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో, చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడేందుకు ఏ విధంగా తెగిస్తున్నారో తెలిస్తే తీరని ఆవేదన కలగకమానదు. 2021 లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పని ప్రదేశంలో ఒత్తిడి కారణంగా దేశం మొత్తం మీద ప్రతివారం కనీసం 50 మంది వరకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వెల్లడైంది.

ఈ విధంగా 2021లో దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని బయటపడింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మరణాల రేటు 7.2% అధికమని చెప్పవచ్చు. కానీ వాస్తవానికి ఈ మరణాల శాతం ఇంకా ఎక్కువ ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉద్యోగులు ఎందుకు ఈ తెగింపునకు పాల్పడుతున్నారో ఆయా సంస్థలు ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదు. ప్రాజెక్టుల పేరుతో నిర్ణీత గడువు విధిస్తూ ఒత్తిడి పెంచుతుండటమే ఇలా జరుగుతున్నాయని, అందుకనే పని ప్రదేశంలో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనేలా ప్రయత్నించాలన్న ఆలోచన కార్పొరేట్ సంస్థలకు తట్టకపోవడం అత్యంత శోచనీయం.

ప్రభుత్వాలు తగిన ఉద్యోగాలు కల్పించలేకపోవడంతో నిరుద్యోగ యువత నగరాల్లో కార్పొరేట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. యువతకు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం అని ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు మేడిపండు చందంగా ఉంటున్నాయి తప్ప వాస్తవానికి క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో లక్షల్లో తమకు వేతనాలు అందుతాయన్న ఆశతో బహుళ జాతి సంస్థలను ఆశ్రయించడం యువతకు తప్పనిసరి అవుతోంది. యువతకు అందమైన రంగుల హరివిల్లులో ఆకర్షిస్తున్న నగరాలే ఇప్పుడు యువతకు ఉరితాళ్లు బిగిస్తున్నాయని 2022లో ‘బిజినెస్ ఇన్‌సైడర్’ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. దేశం లోని 53 నగరాల్లో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ (2760), చెన్నై (2699), బెంగళూరు (2292), ముంబై (1436)లోనే 35.5 శాతం జరిగాయని ఆ వెబ్‌సైట్ విశ్లేషించడం గమనార్హం.

కొన్ని ఉదాహరణలను ఈ సందర్భంగా పరిశీలిద్దాం. 2022 జనవరిలో 31 సంవత్సరాల ఐటి ఉద్యోగి పనిఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానంటూ తన కుటుంబ సభ్యులకు పదేపదే చెబుతుండడమే కాక, హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరులో గురుగ్రామ్‌లో 39 సంవత్సరాల అసిస్టెంట్ మేనేజర్ తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2021 లో హైదరాబాద్‌లోని టిసిఎస్‌లో పని చేస్తున్న యువకుడు పని ఒత్తిడి వల్లనే చనిపోయాడు. 2019లో 24 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన యువతి తాను పనిచేస్తున్న సంస్థ ఉద్యోగం నుంచి తొలగించడంతో హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ హోటల్‌లో బలవన్మరణానికి బలైపోయింది. అదే సంవత్సరం 23 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీర్ఘకాల పని గంటలు, కష్టతరమైన డెడ్‌లైన్లు, అధిక పనిభారం ఇవన్నీ ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడికి దారితీస్తున్నాయి.

కొందరు ఐటి ఉద్యోగులు వారాంతపు సెలవు రోజుల్లో కూడా తమతోపాటు లాప్‌టాప్ తీసుకెళ్లి ఇంటి దగ్గర పని చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. పని ప్రదేశంలో ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేలా చూడాలని, వారి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా ఆయా సంస్థలు తమ మేనేజర్లకు శిక్షణ ఇవ్వాలని సూచనలు అందుతున్నా వాటిని క్రియారూపం లో పాటించే పరిస్థితి కనిపించడం లేదు. కర్ణాటకలో ఇటీవల ఐటి కంపెనీలు ఉద్యోగులకు 14 నుంచి 18 గంటల వరకు పనివేళలు పెంచడం ఐటి రంగంలో కల్లోలం రేగిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఉద్యోగులు నిర్విరామంగా 18 గంటలు పని చేస్తేనే ఉత్పత్తి అధికంగా సాధించగలమని హితోక్తులు పలికిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News