మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన 70 మంది విద్యార్థులను ఐదు రోజుల ఔట్‌డోర్ శిక్షణ కోసం భువనగిరి లోని రాక్ క్లింబింగ్ స్కూల్‌కు పంపించారు. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి అవసరమని ఇది స్కూల్ దశలోనే విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉన్నందున ఔట్‌డోర్ ప్రొగ్రామ్స్ ఇందుకు దోహదపడతాయని గిరిజన సంక్షేమ శాఖ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు అందులో వారిని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఔట్ డోర్ కార్యక్రమాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ విద్యార్థులకు జులై 18 నుండి 22 వరకు ఐదు రోజుల పాటు విద్యార్థులు హైకింగ్, రాక క్లింబింగ్, రాపెల్లింగ్ లాంటి డోర్ యాక్టివిటీస్ లో శిక్షణ పొందుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 10 పాఠశాలల నుండి ఉత్తమమైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ శిక్షణకు పంపించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు.