మనతెలంగాణ/మహబూబాబాద్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసిటి) ఆడిటోరియంలో జరిగిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి).. యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్(వైఐపి) 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహబూబాబాద్ మండలం కంబాలపల్లి విద్యార్థులు ఈ.సాయిలేఖ్య, డి.ప్రశాంత్‌లతో పాటు గైడ్ టీచర్ వి. గురునాధరావు పాల్గొన్నారని పాఠశాల ప్రధానోపాద్యాయులు శ్రీరాం రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు, గైడ్ టీచర్‌కు సి.సి.ఎం.బి డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యన్.వినయ్ కుమార్, టి.ఐ.ఎఫ్. ఆర్ ప్రొఫెసర్ ఉల్లాస్‌లతో ముచ్చటించే అరుదైన అవకాశం కలిగినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉల్లాస్ జీవక్రియ వ్యాధులు పెరుగుదల, ఎపిజెనెటిక్స్‌పై జరుగుతున్న వివిధ పరిశోధనల తీరు తెన్నులను వివరించారని తెలిపారు. ఇది తమకు జీవులలో మెటాబిలిసం ప్రాముఖ్యతను తెలియచేసిందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ వి. గురునాధ రావు మాట్లాడుతూ.. ఒక గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక శాస్త్ర పరిశోధన సంస్థ, సిసిఎంబి డైరెక్టర్‌ను, టి.ఐ.ఎఫ్, ఆర్ ప్రొఫెసర్‌ను కలిసే అరుదైన అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగిందని వివరించారు. కాగా సిసిఎంబిఇ యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే 25 మంది విద్యార్థుల వివరాలను వారంలోగా నిర్వాహాకులు విడుదల చేయనున్నారని ఆయన గురునాధరావు తెలిపారు.