మన తెలంగాణ / హైదరాబాద్ : జెఈఈ అడ్వాన్డ్ ఫలితాల్లో రాష్ట్ర గిరిజన గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సోమవారం ఐఐటిలో టాప్ ర్యాంకులు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులు మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. రాజేంద్ర నగర్‌తో పాటు మిగతా గిరిజన గురుకులాలలో ఐఐటి అడ్వాన్స్ శిక్షణ ఇచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలపారు. ఈ ఏడాది 237 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా వారిలో 132 మంది విద్యార్థులు ఐఐటి ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించారని అన్నారు.
వి. శ్రీశైలం 121 ర్యాంకుతో మొదటి స్థానంలో శ్రీకాంత్ 171 ర్యాంకుతో రెండో స్థానంలో కె. మహేందర్ 215 ర్యాంకుతో మూడో స్థానంలో, కె.సంతోష్ 215 ర్యాంకుతో నాలుగో స్థానంలో బి. ప్రేమ్ సాగర్ ఐదవ స్థానంలో నిలిచారని మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. గిరిజన గురుకుల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్షమని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ఐఐటి, జెఈఈ, ఎంసెట్ కోచింగ్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, పరిగి, హాయాత్‌నగర్, వరంగల్ లలో ఈ ఏడాది కోచింగ్ సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించే దిశగా కృషి చేసిన సిబ్బందిని, అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.