Thursday, December 26, 2024

మా చదువులెట్లా సాగాలి?..నిరసనలకు దిగిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

డ్రోన్లు, తరచూ రాకెట్ దాడుల హింసాకాండపై మణిపూర్ విద్యార్థి లోకం నిరసనకు దిగింది. సోమవారం వేలాది మంది విద్యార్థులు ఇంఫాల్‌లోని సచివాలయం, రాజ్‌భవన్ ఎదుట ప్రదర్శనలు చేపట్టారు. దీనితో ఈ ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చిరకాలంగా తెగల నడుమ ఘర్షణలు పలు హింసాత్మక ఘటనలతో చల్లారని జ్వాలకు దారితీసింది. ఇప్పుడు సరికొత్తగా డ్రోన్లు, రాకెట్లు దాడుల పోరు సాగడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి యువతరం ప్రస్తుత పరిస్థితిపై నిరసనకు దిగడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రాంతీయ , నిర్వహణాపరమైన సమగ్రతలకు భంగం కలుగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాష్ట్రాన్ని రక్షించాల్సి ఉందని విద్యార్థులు నినదించారు. డ్రోన్లు, రాకెట్ల దాడుల్లో మరో ఎనమండుగురు మృతి చెందడం, 12 మంది గాయపడటం, ఇళ్లు విధ్వంసం వంటి ఘటనలు జరిగాయి.

ఈ నేపథ్యంలోనే స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు దండుగా బయలుదేరి నిరసనలకు దిగారు. లాంగ్‌లీవ్ మణిపూర్, అసమర్థ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలనే నినాదాలు మిన్నంటాయి. ఇక్కడి అధికార యంత్రాంగం పరిస్థితిని అదుపులోకి తేలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి యూనిఫైడ్ కమాండ్‌ను అందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పరిస్థితిని ఎంతకాలం ఈ విధంగా దిగజారుస్తారు? ఎందుకు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారంటూ నిలదీశారు. ఆ తరువాత విద్యార్థుల బృందం ఒకటి గవర్నరు ఎల్ ఆచార్యను , ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను కలిసింది. ఆ తరువాత ఈ బృందం ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. తాము గవర్నర్ ముందు ఆరు డిమాండ్లు పెట్టామని తెలిపారు. డిజిపిని తొలిగించాలి, భద్రతా సలహదారును తీసివేయాలి. యునిఫైడ్ కమాండ్‌కు కంట్రోలు వంటి విషయాలను ప్రస్తావించామని ఈ బృందం వివరించింది.

భయాల నడుమ చదువులు ఎంతకాలం ?
తాము ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో భయంభయంగా చదువుకోవల్సి వస్తోందని, ఈ విషయాన్ని తాను యునిఫైడ్ కమాండ్ సారధి , సిఆర్‌పిఎఫ్ మాజీ డిజిపి కులదీప్ సింగ్‌కు తెలియచేశామని కాలేజీ విద్యార్థి ఎం సనతోయి ఛనూ తెలిపారు. ఆటంకాలు లేకుండా మా చదువులు సాగాలి. భయాలు ఉండరాదు. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా నివారించాల్సిన అవసరం ఉందని సిఎంకు చెప్పినట్లు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కాపాడే బాధ్యతను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధీనంలోని యూనిఫైడ్ కమాండ్‌కు కట్టబెట్టాల్సిందే అన్నారు. రాజధానితో పాటు ఇతర జిల్లా కేంద్రాలలో , పట్టణాలలో కూడా విద్యార్థులు పౌరుల నిరసన ప్రదర్శనలు సాగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News