చాంద్రాయణగుట్ట : విద్యార్థులు బాల్యం నుండే పట్టుదలతో చదివి లక్షాన్ని చేరుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ సూచించారు. తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు పాతనగర మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా స్కూల్ కిట్స్, ఉపకారవేతనాలు ఇవ్వటం అభినందనీయమన్నారు. ఆదివారం ఉప్పుగూడ హనుమాన్‌నగర్ ఫేజ్ మూడు, జ్ఞాన భారతి హైస్కూల్ వద్ద గల సాయి కృప వసంత బంక్వెట్ హాలులో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫారమ్, ఉపకారవేతనాలు, స్కూల్ కిట్స్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎం.లక్ష్మణ్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో నిరుపేద విద్యార్థులలో విద్యావ్యాప్తికి కృషి చేయటాన్ని స్వాగతించారు. పాతనగర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీరాములు మాట్లాడుతూ 1997లో కుల దృవీకరణ పత్రం కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తన సామాజిక వర్గం ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడవద్దని 1998లో సంఘాన్ని స్థాపించినట్లు తెలిపారు. గత 25 ఏళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలతో మున్నూరుకాపు కులస్థులకు అండగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో కులమతాలకు అతీతంగా పేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ, పేద యువతుల వివాహానికి ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
విద్యార్థులు బాల్యం నుండే చదువుపై శ్రద్ధ చూపి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జస్టిస్ ఎం.లక్ష్మణ్ పాతనగర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీరాములను శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ పుప్పాల రవీందర్ కుమార్, మ్యాడం చంద్రకళ, మంద సూర్యప్రకాష్, గరిషె నర్సింగ్‌రావు, దీప్తి నవీన్ ముత్యాల, పి.కృష్ణ, శ్రీధర్, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.