Wednesday, January 22, 2025

సంక్షేమ భవన్ వద్ద విద్యార్థుల ధర్నా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టల్, గురుకుల పాఠశాలలు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, 16 లక్షల కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు పెంచాలని పార్లమెంటు సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు, స్కాలర్ షిప్‌లు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల జీతాలు పెంచుతారు… మా స్కాలర్‌షిప్‌లు పెంచరా…? అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మా హాస్టల్ పిల్లలను చూడండి మా బతుకులు బాగు పరచండి అంటూ నినదించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు, నూనెలు, పప్పులు, కూరగాయలు అన్ని ఆహార వస్తువుల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. ధరలు పెరగడంతో విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని, హాస్టల్ మెను పాటించడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని గుడ్లు, పండ్లు తగ్గించారని కృష్నయ్య పేర్కొన్నారు. హాఓటల్‌లో ఒకపూట భోజనం రూ.60 ఉందని హాస్టల్ విద్యార్థులకు రూ.10 లకు భోజనం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2100 ఇస్తూ హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో న్యాయం ఉందా అని ప్రశ్నించారు. కాబోయే భావి భారత పౌరులకు పూటకు రూ.10ల నాసిరకం భోజనం పెడితే ఎలా అభివృద్ది చెందుతారని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలు రెండు సార్లు పెంచారని, శాసనసభ్యులు, మంత్రుల జీతాలు మూడు రెట్లు పెంచారని వృద్ధాప్య పెన్షన్లు ఐదు రెట్లు పెంచారని విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు మాత్రం పెంచలేదని విమర్శించారు.

వెంటనే స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలు పెంచాలని బిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు రియింబర్స్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు అంజి, నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, తిరుపతి, భాస్కర్ ప్రజాపతి, అనిల్, సంతోష్, రాజు, నిఖిల్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News