Monday, March 17, 2025

గుజరాత్‌లో 35 లగ్జరీ కార్లలో విన్యాసాలు చేస్తూ వెళ్లిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

సూరత్(గుజరాత్): పాఠశాల వీడ్కోలు కార్యక్రమానికి 12వ తరగతి విద్యార్థుల బృందం 35 హైఎండ్(ఖరీదైన) కార్ల కాన్వాయ్‌లో వెళ్తూ మార్గమధ్యలో విన్యాసాలు చేస్తూ వెళ్లారు. దాంతో పోలీసులు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసినట్లు గురువారం ఓ అధికారి తెలిపారు. 22 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. సిటీ రోడ్‌లో మైనర్ స్కూల్ పిల్లలు బిఎండబ్లు, మసెరటి, మెర్సిడెస్, పోర్సే వంటి కార్టను డ్రైవ్ చేసుకుంటే వెళ్లిన వీడియో వైరల్ అయ్యాక వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకున్నారు.

కాగా పిల్లల్లో కొందరు తమ చేతుల్లో స్మోక్ గన్స్ కూడా ప్రదర్శించారు. పైగా కార్ డోర్లపై ప్రమాదకర ఫోజ్‌లో వారు నిల్చుని ముందుకు కదిలారు. సిటీలోని ఓల్‌పాడ్ ప్రాంతంలోని ఫౌంటైన్‌హెడ్ స్కూల్‌కు వారు వీడ్కోలు కార్యక్రమానికి వెళుతూ నానా హంగామా చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో విడుదలయ్యాక నగరంలోని చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. డ్రైవింగ్ లైసెన్సు ఉన్నప్పటికీ వారు ఆ రీతిగా స్కూల్‌కు వాహనాలు నడుపుకుంటూ రావొద్దని స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్దంద్వంగా విద్యార్థులకు స్పష్టం చేసినప్పటికీ ఇలా జరిగింది.

పాల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం దీనికి సంబంధించి ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్.పి.బారోత్ తెలిపారు. ‘మేము 35 కార్లలో 26 కార్లను గుర్తించాము. వాటిలో ఇప్పటి వరకు 22 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. ఆ వాహనాల ఓనర్లకు నోటీసులు జారీ చేశాము. వీడియోలో ముగ్గురు విద్యార్థులు కార్లను డ్రైవ్ చేయడం కూడా కనిపించింది. ఈ విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు’ అని బారోత్ వివరించారు. భారతీయ న్యాయ సంహితలోని 125 సెక్షన్ కింద తమ పిల్లలను లైసెన్సు లేకుండా వాహనాలను నడిపించేందుకు అనుమతి ఇచ్చిన వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News