మనసు జారిన హాయి తిరిగి చేరు
బాత్ వర్శిటీ అధ్యయనంలో వెల్లడి
టెన్షన్ మటుమాయంతో ఆనందం
లండన్ : నిన్ను నువ్వుగా పదిలం చేసుకో నీలోని నిన్ను తెలుసుకో. ప్రశాంతత తద్వారా వచ్చే మానసిక శారీరక స్వస్థత అనంతం అని తేలింది. వ్యక్తులు కనీసం ఓ వారం పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటే ,వాటిని వాడటం మానుకుంటే స్వస్థతతో ఉండొచ్చునని, ఆందోళనకు దూరంగా గడపవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మనకు మనమే కొనితెచ్చుకున్న టెక్నాలజీ మీడియా తద్వారా అనుక్షణ భయాందోళనలు, నిరాశానిస్పృహ వంటి పరిణామాలకు దూరం కావడం మన చేతుల్లోనే ఉందని, కొద్దిరోజులు సోషల్ మీడియాను పక్కకు పెట్టడం ఒక్కటే మార్గం అని సర్వేలో వెల్లడైంది. సైబర్ సైకాలజీ, బిహేవియర్, సోషల్ నెట్‌వర్కింగ్ జర్నల్‌లో అధ్యయనం వివరాలను ప్రచురించారు. తరచూ సోషల్ మీడియా వీక్షణలో గడిపే వారికి క్రమేపీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి, జీవితం పట్ల ఉత్సాహం లేకపోవడం జరుగుతోంది. ఈ రోజులలో సెల్‌ఫోన్లు ఉన్న వారిలో నూటికి 99 శాతం మంది సోషల్ మీడియా క్లిక్‌లకు అలవాటుపడుతున్నారు.
దీనితో వారిలో అత్యధిక మందిలో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి మానసిక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. అనవసర విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్త పరిణామాలన్ని తమ చుట్టూ బిగుసుకుంటున్న భ్రాంతిలో పడుతున్నారు. దీనితో స్వల్పకాలంలోనే ఇటువంటి దశకు చేరుకున్న వారు జీవితం పట్ల మునుపటి ఉత్సాహం లేని స్థితిని తమకు తాముగా తెచ్చుకుంటున్నారు. ఇది వారికి నిజంగానే బయటకు రాలేని పద్మవ్యూహం వంటి పరిస్థితిని తీసుకువస్తోంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత బాత్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకర్త జెఫ్ లాంబర్ట్ సారథ్యంలో పలువురు సైకాలజిస్టులు మనిషి వైఖరిపై తాజా అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో వారు సోషల్ మీడియా ఎఫెక్ట్‌ను పసికట్టారు. ఓ వారం వాటికి దూరంగా ఉండి చూడు. నీలో వచ్చే మార్పు బాగా ఉందనుకుంటే ఇక తరువాతి నిర్ణయం తీసుకో అని తెలిపారు. కొద్ది విరామం ఇస్తే చాలు సత్ఫలితాలు ఏర్పడుతున్నాయని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 18 ఏండ్ల నుంచి 72 ఏండ్ల లోపు వారిలో నమూనాగా అధ్యయనం జరిపారు. ప్రతిరోజూ సోషల్ మీడియాకు అలవాటుపడ్డ వారిని ఎంచుకుని నిర్వహించిన సర్వేలో సామాపజిక మాధ్యమం సామాజికంగా కల్గిస్తున్న ప్రభావం చిత్రితమైంది.