Thursday, January 23, 2025

ఎస్‌సి ఉపకులాలకు న్యాయమెప్పుడు?

- Advertisement -
- Advertisement -

75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందడం లేదు. ముఖ్యంగా ఎస్‌సిల్లో ఉపకులాలుగా వున్న ప్రజలు అభివృద్ధికి ఎంతో దూరంలో వున్నారు. ఎస్‌సిలకు అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల మాల, మాదిగలే గరిష్ఠంగా లబ్ధి పొందుతున్నాయి. ఉమ్మడి ఎపిలో నాలుగేండ్ల పాటు అమలైన వర్గీకరణ కూడా ఉప కులాలకు న్యాయం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎస్‌సి ఉప కులాలను ఆదుకునే విధంగా ఎస్‌సి రిజర్వేషన్లను వర్గీకరించాల్సిన అవసరం ఉన్నది. ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడం లేదు. ఎస్‌సిలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమానతలకు దారితీస్తున్న విషయాన్ని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 16, 338, 341, 342, 342 ఎ అనేవి ఎంతో ప్రాధాన్యత కలిగినవి. రిజర్వేషన్ల లక్ష్యం అసమానతలు తొలగించడమే అయినప్పుడు, కల్పించిన రిజర్వేషన్లతోనే అసమానతలు ఏర్పడటం ఆందోళనకరం.

1996 సెప్టెంబర్‌లో నాటి ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఎస్‌సిలలో ఉన్న 59 కులాల్లో కొన్ని కులాలు మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నాయని, మిగిలిన కులాలు రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నాయని తెలిపింది. అందువల్ల అందరికీ సమ న్యాయం కోసం ఎస్‌సిలను ఎ, బి, సి, డిలుగా వర్గీకరించాలని సూచించింది. దాని ప్రకారం ఏ- గ్రూపులో రెల్లి తదితర 12 కులాలకు ఒక శాతం రిజర్వేషన్;బి- గ్రూపులో మాదిగ తదితర 18 కులాలకు 7 శాతం రిజర్వేషన్; సి గ్రూపులో మాల తదితర 25 కులాలకు 6 శాతం రిజర్వేషన్; డి గ్రూపులో ఆది ఆంధ్ర తదితర 4 కులాలకు ఒక శాతం రిజర్వేషన్. మొత్తం 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ మేరకు 2000 నుంచి 2004 వరకు ఎపి ప్రభుత్వం ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసింది. 2004లో దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఎస్‌సి వర్గీకరణను రద్దు చేస్తూ వర్గీకరణ చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఎస్‌సి వర్గీకరణ కోసం జరిగిన పోరాటాలతో ఎస్‌సిలలో ఉన్న అసమానతలు తొలగించటానికి వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో నివేదికను అందజేసింది.

తెలంగాణలో ఎస్‌సిల జనాభా 63,60,158 ఉండగా, అందులో మాదిగలు 25,09,992 అంటే మొత్తం ఎస్‌సి జనాభాలో 39 శాతం ఉన్నారు. మాలలు 17,05,448 అనగా 27 శాతం ఉన్నారు. ఇక మిగతా వారిలో మోచి, బైండ్ల, హోలీయదాసరి, గోసంగి, చిందు, మాస్టిన్, మాదిగజంగం, మాలజంగం, డక్కలి, సమగర, బేడ బుడగజంగం, నేతకాని, మితల్ అయ్యళ్వార్లు, మాదాసి కురువ, పాకి, బ్యాగరి, దోంబరా, మన్నే మొదలైన అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలు ఉన్నాయి. వీరి జనాభా 21,44, 718. ఎస్‌సిలలో 34 శాతం ఉన్నారు. ఈ దేశ చరిత్రను, పురాణాలను భాగవతం, యాక్షగానాల రూపంలో భవిష్యత్ తరాలకు అందిస్తున్న ఉపకులాలకు చెందిన ప్రజలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు.

భిక్షాటన చేస్తూ, అంగళ్ళలో పూసలు అమ్ముతూ, రోడ్డుపై చెప్పులు కుడుతూ, సంచార జీవనం గడుపుతూ, వీధి సర్కస్ చేస్తూ, గ్రామ దేవతలకు పూజారులుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరంగా మాల, మాదిగలతో పోల్చితే అత్యంత వెనుకబడి ఉన్నారు. కులం, వృత్తి, దారిద్య్రం ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. రిజర్వేషన్ల వల్ల సమ న్యాయం జరుగాలి. ఇదే అంశంపై 2020 ఆగస్టు నెలలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దావీందర్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పరిశీలనకు నివేదించడం జరిగింది. ఈ కేసులో కొన్ని ముఖ్యమైన అంశాలను గమనిస్తే.. ఎస్సీలను వర్గీకరించరాదంటూ 2004లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని, ఎస్‌సిలను వర్గీకరించి వారిలో వెనుకబడ్డ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2004లో చెన్నయ్య కేసును చూసిన బెంచ్ ఇచ్చిన తీర్పు సరికాదని, వాస్తవాలను గుర్తెరగకపోతే సామాజిక మార్పు జరగాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరదని స్పష్టం చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 నుంచి 2004 వరకు అమలులో ఉన్న ఎస్‌సి వర్గీకరణ వల్ల ఎస్‌సిలలో ఉన్న మాల, మాదిగ కులాలు మాత్రమే అధిక లబ్ధి పొందాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఉన్న ఎస్‌సి ఉపకులాలకు తీరని నష్టం జరిగిందని వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గతంలో జరిగిన ఎస్‌సి వర్గీకరణను రద్దు చేసి, అందుకు భిన్నంగా ఎస్‌సి ఉప కులాలకు న్యాయం జరిగే విధంగా హేతుబద్ధంగా ఎస్‌సి వర్గీకరణ జరగాలి. ఎస్‌సి ఉపకులాలను ‘ఎ’ గ్రూపులో; మాదిగలను ‘బి’ గ్రూపులో, మాలలు ‘సి’ గ్రూపులో ఉండేట్లు ఎస్‌సిల వర్గీకరణ జరగాలి.మూడు గ్రూపులకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించాలి. మాలల ద్వారా మాదిగలకు నష్టం జరిగిందని అంటున్నారు. అది నిజమే కానీ.. మాల, మాదిగల ద్వారా ఎస్‌సి ఉపకులాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతూనే ఉంది. దీనిని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకే జాతి వారమన్న నెపంతో సంపన్న శ్రేణివారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందడం సరికాదు. కాబట్టి రాజ్యాంగ రక్షకులైన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఈ అసమానతలను తొలగించటానికి తగుచర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఎస్‌సిల్లో ఉన్న ఉప కులాలకు రిజర్వేషన్లలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

బి. వెంకటేశం మోచి
94919 94090

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News