Monday, December 23, 2024

దశాబ్దాల పోరాటం ఫలించింది

- Advertisement -
- Advertisement -

విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇవ్వడం స్వాగతించవలసిన విషయం. కొన్నేళ్లుగా ఆయా వర్గాలు సాగిస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించింది. దీని పూర్వాపరాలు పరిశీలిస్తే వాల్మీకి, మఝాబి సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను కొట్టివేస్తూ పంజాబ్‌హర్యానా హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఎస్‌సి కేటగిరిలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ‘ఇ.వి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసు లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఉదహరిస్తూ పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2020లో సుప్రీం కోర్టు ధర్మాసనం గతంలో ఇ.వి చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది. ఈ తీర్పును పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ గురువారం తీర్పు వెలువడడం చారిత్రక సంఘటనగా పేర్కొనవచ్చు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టవలసిన ప్రాముఖ్యతకు ఊతం లభించింది. వాస్తవానికి ఎస్‌సిల రిజర్వేషన్‌ను వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు.

ఈ విషయంలో ఏ రాష్ట్రమైనా తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించడం వరకే వాటి అధికారాలు పరిమితమై ఉంటాయి. ఎస్‌సిల రిజర్వేషన్‌న్లను అంతర్వర్గీకరణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అందుకు తగిన సవరణను చట్టానికి తీసుకురావలసి ఉంటుంది. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉషా మెహ్రా కమిషన్ ఎస్‌సి కోటాను ఎస్‌సిలోని అన్ని కులాలకు అందేలా విభజించవలసిన అవసరాన్ని 2008లో స్పష్టం చేసింది. ఆ మేరకు రాజ్యాంగం 341 అధికరణను సవరించాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మీద కులగణన చేపడితేనే ఎవరెంత మంది ఉన్నారో కచ్చితంగా సంఖ్య తెలుస్తుంది. దాని ఆధారంగా ఉపవర్గీకరణలో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్రాలకు సులువవుతుంది. రాహుల్ వంటి విపక్ష నేతలు కూడా దేశం మొత్తం మీద కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సారథ్యంలో కులగణనను చేపట్టిన మొదటి రాష్ట్రంగా బీహార్ ఖ్యాతిని సాధించింది.

కులగణన వల్ల షెడ్యూల్డ్ కులాలు కానీ, వెనుకబడిన తరగతులు కానీ వారి జనాభా స్పష్టంగా తెలుస్తుందని, వారి వాస్తవ స్థితిగతులు వెల్లడి అవుతాయని, సంక్షేమాన్ని మరింత మెరుగ్గా అమలు చేసి వారికి ఇప్పటికంటే బలమైన చేయూతను అందించడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం పాత గణాంకాల ప్రకారమే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున ఎస్‌సి, ఎస్‌టి, బిసిల ప్రస్తుత సంఖ్యను తెలుసుకోడానికి ప్రయత్నించింది. సామాజిక న్యాయ సాధనను సమగ్ర స్థాయికి తీసుకుపోవడానికి దారితీసే ఆలోచనను అమలులో పెడుతున్న రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చివరి సారిగా జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించింది. జనాభాలో వెనుకబడిన తరగతులు 52% ఉన్నారని ఆ లెక్కల్లో తేలింది. కులాలవారీ గణన వల్ల కులదృష్టి మాసిపోకుండా కొనసాగుతుందని, అది భారతీయ సమాజానికే మంచిది కాదని భావించి స్వాతంత్య్రానంతర పాలకులు దానికి స్వస్తి చెప్పారు.

దీనిపై మండల కమిషన్ నివేదిక తీసుకొచ్చినా దాని అమలు కూడా సంపూర్ణంగా సాగలేదు. ఈ పరిస్థితుల్లో ఏ కులాలవారు వెనుకబడి ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు సామాజిక న్యాయ నినాదాన్ని చేపట్టింది. కర్ణాటకలో 2023లో అప్పటి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రయత్నించి విఫలమైంది. 2005లో కాంగ్రెస్ జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో ఏర్పాటైన జస్టిస్ సదాశివ కమిషన్ 2012లో దీనిపై నివేదిక సమర్పించింది. ఆ నివేదికను అమలు చేయడానికి బొమ్మై ప్రభుత్వం ప్రయత్నించడం ఆందోళనకు దారి తీసింది. ఈ నివేదికలోని సిఫారసులు తమకు హానికరంగా ఉన్నాయని బంజారా తదితర ఎస్‌సి కులాలు తమ వ్యతిరేకతను తెలియజేశాయి. గతంలో 15 శాతంగా ఉండే ఎస్‌సి రిజర్వేషన్లను 17 శాతానికి పెంచారు. పైనున్న కులస్థులకే రిజర్వేషన్లు అందుతున్నాయన్న అసంతృప్తితో ఉన్న ఉప కులాలు వర్గీకరణను కోరుతున్నాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో ఈ ఉపకులాలకు ఊరట లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News