Thursday, January 9, 2025

వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని మరణించిన
ఎస్‌ఐ పూసూరు ఫెరిడో రిసార్ట్‌లో సంఘటన
ఆత్మహత్యపై పలు అనుమానాలు ఈనెల 6న
ఎంగేజిమెంట్‌కు ముహూర్తం ఫిక్స్..అంతలోనే
ఘాతుకం వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్యకు
పాల్పడినట్లు ఉన్నతాధికారుల వెల్లడి

ములుగు జిల్లా, వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ (30) మండల పరిధిలోని పూసూరు గోదావరి వంతెన సమీపంలో ఉన్న ఫెరిడో రిసార్ట్‌లో సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించినప్పడికీ ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఓ యువతి ఉండటంతో అనేక అనుమానాలకు దారీతీస్తోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు పూసూరు రిసార్ట్‌కు వెళ్ళిన ఆయన సోమవారం ఉదయాన్నే సుమారు 6.30 సమయంలో తన సర్వీస్ రివాల్వర్‌తో గదిలో నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇటీవలే అతని తల్లిదండ్రులు పెళ్ళి సంబంధం కుదిర్చారు. ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించిన ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం ఉండగా ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీగా విలపించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తూ మండలంలో మంచిపేరు సాంపదించుకున్న హరీశ్ ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారనే సమాచారంతో సంఘటన స్థలానికి వాజేడు, వెంకటాపురం మండలాల సిఐ బండారు కుమార్, ములుగు ఎస్‌పి శబరీష్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వ్యక్తిగత కారణాల వలన హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అక్కడ ఉన్న యువతి ఎవరు అనే దానిపై సమగ్ర విచారణ జరిపి నిజనిజాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించారు.

మొదటిసారి విధులు వాజేడు మండలంలోనే…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గోరుకొత్తపల్లి మండలం, వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన రుద్రారపు రామయ్య, మల్లికాంబ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. రెండవ కుమారుడు రుద్రారపు హరీశ్. రైతు కుటుంబం నుంచి వచ్చిన హరీశ్ ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగం పై ఉన్న మక్కువతో ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించాడు. 2020 బ్యాచ్‌కు సంబంధించిన ఆయన ఎస్‌ఐగా ఎంపికైన తరువాత మొదటిసారిగా వాజేడు పోలీసు స్టేషన్‌లో ట్రైనీ ఎస్‌ఐగా కొన్ని నెలలు బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత 2022లో పేరూరు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పాటు విధులు నిర్వహించి ఆ తరువాత ములుగు విఆర్‌కు బదిలీ అయ్యాడు. ఆ తరువాత 2024 జూన్ 17న వాజేడు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పెంపొందిస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నాడు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ఎస్‌ఐ హరీశ్ తన సొంత రివాల్వర్‌తో నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మండల ప్రజలు విస్మయానికి గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News