Friday, November 22, 2024

ఎసిబిలో వలలో సబ్‌ ఇన్‌స్పెక్టర్..

- Advertisement -
- Advertisement -

చింతలమానేపల్లి: సబ్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలలో చిక్కుకున్న సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీస్ కరీంనగర్, ఆదిలాబాద్ ఇంచార్జ్ డిఎస్‌పి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని దిందా గ్రామానికి చెందిన ఓ మహిళ గత నెల 2న అదృశ్యం కావటంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే అదృశ్యమైన మహిళ అదే నెల4న మహారాష్ట్రలోని అహెరికి వెళ్లి తిరిగి వచ్చింది. ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన డోకే ప్రశాంత్ సహకరించాడని ఈ కేసు నీమీదకు రాకుండా ఉండాలంటే రూ. 70 వేలు ఇవ్వాలని ఎస్‌ఐ వెంకటేశ్ డిమాండ్ చేశాడు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతానని గత నెల రోజుల నుంచి ప్రశాంత్‌ను ఎస్‌ఐ బెదిరిస్తున్నాడు.

చివరకు రూ. 20 వేలు ఇవ్వాలని ఎస్‌ఐ కోరడంతో బెదిరింపులు తట్టుకోలేక ప్రశాంత్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం ఎస్‌ఐ తన మధ్యవర్తి శ్రీనివాస్‌ను ప్రశాంత్ ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని పంపించాడు. దీంతో అతడు డబ్బులు తీసుకుంటుండగా అక్కడే ఉన్న ఎసిబి అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎసిబి అధికారులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఎస్‌ఐ వెంకటేశ్, హోంగార్డు జనార్దన్‌ను విచారించారు. ఎసిబి అధికారుల విచారణలో మహిళ కేసులో డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తేల్చిన అధికారులు వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకొని కరీంనగర్‌లోని ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి తెలిపారు. మండలంలో అధికారులు ఏదైనా విషయంలో డబ్బులు కావాలని వేధిస్తే వెంటనే తమ నెంబర్ 9154388963 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News