జైపూర్: ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు భక్షకులుగా మారితే దేవుడే దిక్కు అన్నట్టుగా ఉంటుంది. వరకట్న వేధింపుల కేసులో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్ఐ అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్ లోని అల్వారు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వరకట్న వేధింపులకు భర్త గురి చేస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో మార్చి 2న ఫిర్యాదు చేయడానికి మహిళ వెళ్లింది. ఎస్ఐ తన గదిలో తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని సదరు మహిళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బయటపడింది. 2018లో వరకట్న ఇవ్వాలని భర్త బెదిరించడంతో అతడిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే అదునుగా భావించిన భర్త ఆమెకు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా ఆమె ఒప్పుకోవడంలేదు. మళ్లీ భర్తపై ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వచ్చినప్పుడు మార్చి 2 నుంచి 4వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ లోని తన రూమ్ లో ఎస్ఐ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్ఐని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ తెలిపాడు.