Monday, December 23, 2024

అవినీతి జరిగితే సబ్ రిజిస్ట్రార్ దే బాధ్యత

- Advertisement -
- Advertisement -

నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ
నాలుగు రోజులుగా సర్వర్ డౌన్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలైన్‌లు
కొత్త విధానంతో ఇబ్బందులు పడుతున్నాం : సబ్ రిజిస్ట్రార్‌లు

మనతెలంగాణ/హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల జరిగిన కొన్ని అక్రమాలను దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేస్తూ ధరణిలో అనుసరిస్తున్న పద్ధతులను ప్రవేశపెట్టడం ఆ శాఖలో సంచలనంగా మారింది. ఈ కొత్త విధానంతో సబ్ రిజిస్ట్రార్‌ల ను జవాబుదారుగా చేయడంతో రానున్న రోజు ల్లో తప్పు జరిగితే తామే బాధ్యులుగా నిలబడా ల్సి వస్తుందని, రిటైర్‌మెంట్ అయినా తమకు వచ్చే బెనిఫిట్స్‌కు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న భయాందోళనను సబ్ రిజిస్ట్రార్‌లు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ విధానం తమ కు ఇబ్బందికరంగా మారిందని కొందరు సబ్ రిజిస్ట్రార్ బాహాటంగానే వ్యతిరేకించడం గమనార్హం. కానీ, సబ్ రిజిస్ట్రార్‌లు వ్యతిరేకిస్తున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఇంతకంటే వేరే మార్గం లేదనీ, తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్‌లు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు బాధ్యత వహించాల్సిందేనని వారు పేర్కొంటున్నారు.

Also Read: జెడి చక్రవర్తిని ప్రేమిస్తున్నాను… పెళ్లి చేసుకుంటాను: విష్ణు ప్రియ

ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భారీగా క్యూ లైన్‌లు…

అయితే నాలుగు రోజులుగా అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ సమస్య నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కొనుగోలు, విక్రయదారులతో కూడిన క్యూలైన్ భారీగా ఉంటుం ది. అధికారులు కొత్తగా ప్రతి డాక్యుమెంట్‌కు సబ్ రిజిస్ట్రార్ వేలిముద్ర వేసి ఆ డాక్యుమెంట్‌ను ఓకే చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతోంది. ప్రస్తుతం ధర ణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు తహసీల్దార్‌లు ఇదే విధానాన్ని అమలు చేస్తుండడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఈ విధానాన్నే కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్‌లు ప్రతి డాక్యుమెంట్‌కు వేలిముద్ర వేయగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌లో (కార్డులో) ఆ రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఫీడింగ్ అవుతుండడంతో సర్వర్‌పై అదనపు భారం పడుతుందని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. గతంలో సబ్ రిజిస్ట్రార్‌లు సంతకం చేయగానే క్రయ, విక్రయదారుల ఫొటోలను తీసుకొని వారి వేలిముద్రలను తీసుకునేవారు. దీంతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. ప్రస్తుతం ఈ నూతన విధానంతో సర్వర్‌పై ఎక్కువ భారం పడుతుందని సబ్ రిజిస్ట్రార్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నాలుగు రోజులుగా క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని, టెక్నికల్ టీం తమవంతు ప్రయత్నాలు చేస్తోందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

సబ్ రిజిస్ట్రార్‌లదే బాధ్యత…

అయితే ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురావడం వెనుక ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించే దిశగా తాము కృషి చేస్తున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలపడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్‌లు తమ లాగిన్‌లో ప్రతి డాక్యుమెంట్‌కు వేలిముద్ర వేస్తే ఆ రిజిస్ట్రేషన్ విషయంలో పూర్తిగా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల్లో కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతికి పాల్పడినా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ విధానంతో ప్రతి డాక్యుమెంట్‌కు సంబంధించిన పూర్తి బాధ్యత సబ్ రిజిస్ట్రార్ వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టుగా ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ నూతన విధానంతో తాము ఇబ్బ ందులు పడుతున్నామని, దీనివల్ల కొత్తగా ఒనగూరే ప్రయోజనం లేదని సబ్ రిజిస్ట్రార్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రతి రిజిస్ట్రేషన్‌కు అదనపు సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల క్రితం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో….

రెండు నెలల క్రితం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 డాక్యుమెంట్‌లకు సంబంధించి అవినీతి జరిగింది. అక్కడ పనిచేసే కొంద రు సిబ్బంది గతంలో జరిగిన డాక్యుమెంట్‌లను తొలగించి వాటి స్థానంలో అదే నెంబర్‌తో వేరే డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆయా అధికారులు, సిబ్బంది చేసిన తప్పిదంతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యజమానుల ఆస్తుల వివరాలు ఈసీలో కనిపించలేదు. దీంతో ఆయా ఆస్తుల యజమానులందరూ కలిసి ఈ విషయమై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్‌లతో పాటు మరో ముగ్గురు సిబ్బందిపై చర్యలు చేపట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ శాఖ ఉన్నతాధికారులు పకడ్భందీగా రిజిస్ట్రేషన్‌లు చేయడంతో పాటు క్రయ, విక్రయదారులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టేలా ఇలాంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నట్టు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News