Saturday, November 16, 2024

కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సుబ్బారెడ్డి దంపతులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టిటిడి తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి కి డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, శాసన సభ్యులు ఎం ఎస్ బాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానంద రెడ్డి, కాణిపాకం ఆలయ ఈవో వెంకటేసు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తో పాటు డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, ఆలయ ఈవో కు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. ఇఒ వెంకటేశ్ టిటిడి చైర్మన్ దంపతులతో పాటు మిగిలిన అతిథులకు స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు.

బంగారు రథాన్ని పరిశీలించిన చైర్మన్

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టిటిడి ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వినాయక స్వామి వారికి టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టిటిడికి రూ 6 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యమయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. టిటిడి ఇఇ శివరామ కృష్ణ, ఎఇఒ మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి, కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News