సుప్రీంని ఆశ్రయించాలని శరద్ పవార్ నిర్ణయం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని వర్గాన్ని అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)గా ఎన్నికల సంఘం ప్రకటించిన దరిమిలా శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి వర్గం బుధవారం ఎన్నికల సంఘానికి మూడు పేర్లు, చిహ్రాలను సమర్పించింది. శరద్ పవార్ వర్గం సమర్పించిన పేర్లలో శరద్ పవార్ కాంగ్రెస్, మై రాష్ట్రవాది, శరద్ స్వాభిమాని ఉన్నాయి. అదే విధంగా సమర్పించిన మూడు చిహ్నాలలో టీ కప్పు, పొద్దు తిరుగుడు పువ్వు(సన్‌ఫ్లవర్), ఉదయించే సూర్యుడు ఉన్నాయని వర్గాలు వెల్లడించాయి.
అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్‌సిపిగా ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తమ వర్గానికి కొత్త పేరును సూచించాలని ఎన్నికల సంఘం శరద్ పవార్ వర్గాన్ని కోరింది. అజిత్ పవార్ వర్గానికే ఎన్‌సిపికి చెందిన గడియారం గుర్తును కేటాయిస్తున్నట్లు ఇసి ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటనపై అజిత్ పవార్ వర్గం పండుగ చేసుకోగా శరద్ పవార్ వర్గం మాత్రం ఇది ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించింది. ఇసి నిర్ణయాన్ని తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని శరద్ పవార్ వర్గం ప్రకటించింది. తన నిర్ణయానికి ఇసి సిగ్గుపడాల్సి ఉంటుందని శరద్ వర్గం వ్యాఖ్యానించింది.
తన సొంత బాబాయ్, ఎన్‌సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను అజిత్ పవార్ రాజకీయంగా దెబ్బతీశారని ఆరోపించింది. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామని, అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌ను రాజకీయంగా చావుదెబ్బతీశారని, దీని వెనుక అజిత్ పవార్ ఉన్నారని శరద్ పవార్ వర్గం నాయకుడు జితేంద్ర అహ్వాద్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సిగ్గుపడాల్సింది ఎన్నికల సంఘమేనని ఆయన అన్నారు. శరద్ పవార్ ఉష్ట్ర పక్షి(ఫినిక్) లాంటి వారని, ఊబడిద నుంచి మళ్లీ ఆయన మొదలుపెడతారని చెప్పారు. తమకు శరద్ పవార్ ఉన్నారని, అందుకే తమకే బలం ఉందని ఆయన చెప్పారు. తాము సుప్రీంకోర్టు తలుపు తడతామని అహ్వాద్ తెలిపారు.