కేంద్రం, ఆర్‌బిఐకి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాలను సమర్పించవలసిందిగా కేంద్రం, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ)లను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్‌ఎ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వితన తీర్పును రిజర్వ్ చేసింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పి చిదంబరం, శ్యాం దివాన్ తదితరులు వాదనలు వినిపించగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, ఆర్‌బిఐ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోద్రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సంబంధిత దస్త్రాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బొపనన, జస్టిస్ వి సుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్న ఉన్నారు. సీల్డ్ కవర్‌లో దస్త్రాలను కోర్టుకు సమర్పిస్తానని అటార్నీ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మొత్తం 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.