Monday, December 23, 2024

నక్షత్ర పరిశోధనలో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 1983లో నోబెల్ పురస్కారం స్వీకరించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ మనవాడు. దక్షిణ భారతానికి చెందినవాడు. హైస్కూలు, కాలేజీ చదువులు మద్రాస్ (చెన్నై)లో చదివినవాడు. అయితే నక్షత్రాల లెక్కలు గట్టి జ్యోతిష్యాలు చెప్పే భారతీయ జ్యోతిష్య పండితులకు కనీసం ఈయన పేరు కూడా తెలియదు. నక్షత్ర పరిణామాన్ని విప్పి చెప్పిన మేధావిని గూర్చి కనీసం తెలుసుకోరు. తమ అజ్ఞానంలో తాము వుంటూ జనాన్ని మోసం చేస్తుంటారు. 1953లో డా. చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించి వుండకపోతే ఆయన మన భారతీయ శాస్త్రవేత్త అని ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్ళం. అది వేరే సంగతి! మనుషుల్లాగే నక్షత్రాలు పుడతాయి. ఎదుగుతాయి. ఆకాశంలో ప్రకాశిస్తాయి. చివరకు వినీలాకాశంలో నిబిడీకృతమైపోతాయి. నక్షత్రాల జీవిత చరిత్రల్ని వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే. వారు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు. వారు వేసిన దారిలోనే పయనించి నోబెల్ బహుమతి సాధించిన వాడు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (19 అక్టోబర్ 1910 21 ఆగస్టు 1995) మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి పరిశోధనలు సాగించిన వాడు. పందొమ్మిదవ యేట ఓడ మీద ఇంగ్లాండు వెళుతూ ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలెన్నో అధ్యయనం చేశాడు. 1935 జనవరి 11 శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం. ఇంగ్లండ్‌లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ (ఆర్‌ఎఎస్) సమావేశాలు జరుగుతున్నాయి. తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్‌టన్ హౌస్ వరకు నడిచి వచ్చిన చంద్రశేఖర్ మిత్రుడితో కలిసే టీ తాగాడు. తన పరిశోధనా పత్రాన్ని చదవడానికి వేదికపైకి వెళ్ళాడు. అంతే! సభ తీవ్రమైన ఆలోచనలతో మునిగిపోయింది. ఇరవై నాలుగేళ్ళ భారతీయ యువకుడు తలలు పండిన భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలందరినీ మంత్రుముగ్ధులను చేశాడు. ఒక సాధారణ వ్యక్తిగా వేదిక ఎక్కినవాడు, అసాధారణ పరిశోధకుడుగా వేదిక దిగాడు. ముఖంలో బాల్యపు ఛాయలైనా వదలని ఆ యువకుడు కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యాడు.

ఆ గౌరవం అప్పటికి 16 ఏళ్ళకి ముందు భారత గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌కు దక్కింది. ఆ అవకాశాన్ని ఏ మాత్రం దుర్వినియోగం చేయకుండా చంద్రశేఖర్ ఆకాశాన్నే తన ప్రయోగశాల చేసుకున్నాడు. సుదీర్ఘమైన పేరుతో పిలవలేక అందరూ అతణ్ణి ‘చంద్ర’ అని పిలుస్తూ వుండేవారు. కొడుకు సాధిస్తున్న విజయాల్ని తెలుసుకొని చంద్ర నాన్న సి.ఎస్. అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతూ వుండేవారు. అప్పటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ చంద్ర పరిశోధనల్ని బహిరంగంగా ఎద్దేవా చేస్తుండేవాడు. కారణం జాతి విచక్షణ.1930లో నోబెల్ బహుమతి సాధించిన భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యుడే. ఒకసారి చంద్ర స్వదేశం తిరిగి వచ్చినపుడు కలకత్తా వెళ్ళి అంకుల్ సి.వి. రామన్‌ని కలిసి వచ్చాడు. ఆ సందర్భంలో రామన్ అన్నారట “పుస్తకాలు రాయడానికి నాకు తీరిక లేకుండా పోయింది. నాకు పరిశోధనలో వున్న ఉత్సాహం పుస్తకాలు రాయడంలో లేదు. అయినా కాంతి విచ్ఛేదనం మీద హెచ్. కబ్బెన్నెస్ పుస్తకం రాశాడట కదా? నేనింక రాయడమెందుకూ? అని మానుకున్నాను. నాకు నోబెల్ బహుమతి వచ్చింది.

ఆయన పుస్తకం రాశాడు” అని! “అయితే నాకు నాలుగు నోబెల్ బహుమతులు తప్పిపోయాయి!” అని అన్నాడట చంద్ర. “ఆఁ ఆఁ నోబెల్ బహుమతి అంటే మజాకా కాదు. ఏమనుకున్నావో ” అని సి.వి. రామన్, చంద్రశేఖర్‌ను బెదరగొట్టాడు.
అప్పుడు వారి సంభాషణ అలా సాగినా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు నోబెల్ పురస్కారం తప్పిపోలేదు. 1983లో ఆ బహుమతిని చంద్ర విలియం ఫౌలర్‌తో కలిసి స్వీకరించారు. ఒక విచిత్రమైన విషయమేమంటే చంద్రకు టి.డి.లీ, సి.యన్. యంగ్ అని ఇద్దరు సన్నిహితులైన విద్యార్థులు వుండేవారు. వారి కోసం ఆయన ఒక వంద మైళ్ళు కారు ప్రయాణం చేసి విస్కాన్ సిన్‌లో సముద్ర దగ్గరలో వున్న ఐర్క్ అబ్జర్వేటరీ నుండి షికాగో యూనివర్శిటీకి వారం తప్పించి వారం వెళుతూ వుండేవారు. వారితో చర్చిస్తూ వారికి తెలియని విషయాలెన్నో బోధిస్తూ వుండేవారు. ఆ శిష్యులిద్దరికీ వయోలేషన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పార్టీ (VIOLATIONS OF THE PRINCIPLE OF PARTY) కి 1957 నోబెల్ బహుమతి లభించింది. వారికి పరిశోధనా రంగంలో మార్గదర్శి అయిన ఈ గురువుకి మాత్రం అదే బహుమతి రావడానికి ఇరవై ఆరేళ్ళు పట్టింది.

1983లో నోబెల్ లారెట్‌కు గౌరవ పూర్వకంగా ఇచ్చిన విందులో చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. 1970వ దశకంలో ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. కొద్దిలో గండం గడిచి బయటపడ్డారు. అందుకే తనకు లభించిన నోబెల్ బహుమతి తన జీవితానికి కొనసాగింపునిచ్చిన డాక్టర్ చలువ వల్ల వచ్చిందని ప్రకటించారు. ఆయన విశాల దృక్పథానికి, కృతజ్ఞతా భావానికి జేజేలు పలకాలి. ఏరు దాటాక తెప్ప తగలేసే లోకంలో చంద్రశేఖర్ లాంటి వారు కూడా వున్నారన్నది గ్రహించాలి. గొప్పవాళ్ళు కేవలం వారు చేసిన కృషి వల్ల మాత్రమే గొప్ప వాళ్ళు కారు. వారి వ్యక్తిత్వం వల్ల కూడా అవుతారు. చంద్ర సీతాలక్ష్మీ చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ (సి.యస్. అయ్యర్) దంపతులకు 19 అక్టోబర్ 1910న బ్రిటిష ఇండియాలోని లాహోర్‌లో జన్మించారు. ఇప్పుడా నగరం పాకిస్తాన్‌లో వుంది. ఈయన తండ్రి రైల్వేలో డిప్యూటీ ఆడిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో చంద్ర అక్కడ జన్మించారు. అసలైతే వారిది తమిళనాడుకు చెందిన కుటుంబం. లాహోర్ నుండి ఉద్యోగ రీత్యా అలహాబాద్‌కు మారి, చివరికి ఆ కుటుంబం మద్రాసుకు చేరుకొంది.

చంద్ర విద్యాభ్యాసం అక్కడే ప్రారంమైంది. తల్లి సీతాలక్ష్మి సాహిత్యం, లలిత కళలంటే మక్కువ. ఆమె ఆ రోజుల్లోనే హెన్రిక్ ఇబ్సన్ రచన ‘ఎ డాల్స్ హౌస్’ ను తమిళంలోకి అనువదించారు. బాల్యంలో చంద్రకు తమిళం నేర్పించేవారు. తండ్రి అయ్యర్ లెక్కలు చెప్పేవారు. తలిదండ్రులు చదువుకొన్న వారై వుండి, బాధ్యతగా పిల్లలకు చదువు చెప్పుకుంటే తప్పకుండా వారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే వారవుతారు. వీరినే మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. చెన్నైలోని హిందూ హైస్కూలులో పాఠశాల చదువు పూర్తి చేసుకొన్న చంద్ర తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతూ ప్రతిభ కనబరిచినందువల్ల నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం స్కాలర్ షిప్ అందించింది. దాంతో ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి కేంబ్రిడ్జిలో ఉన్నత విద్యనభ్యసించారు. పాలిట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ (POLY TROPHIC DISTRIBUTIONS) అనే విషయం మీద 1933లో తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రకటించారు. ఈయన పరిశోధనకు గైడ్‌గా వ్యవహరించింది రోల్ఫ్ హెచ్. ఫౌలర్. సెప్టెంబర్ 1974లో ఆయనను డాక్టర్లు బలవంతంగా ఆసుపత్రిలో విశ్రాంతి కోసం వుంచాల్సి వచ్చింది.

అప్పుడు కూడా ఆయన సమయం వృథా చేయలేదు. షేక్సిపియర్‌ను క్షుణ్ణంగా చదివారు. హామ్లెట్ అభిమాని అయ్యారు. ప్రతిభావంతులెప్పుడూ తమ తమ రంగాలకు మాత్రమే పరిమితమై వుండరు. ఇతర రంగాలకూ వ్యాపిస్తారు. వాటిలోని గొప్పదనాన్ని ఆస్వాదిస్తారు. పరిపూర్ణ మానవుడంటే ఆధునిక నిర్వచనం ఇదే. జీవితంలో సృజనాత్మకతను పట్టుకొన్న వాడికి ఈ రంగం ఆ రంగం అని తేడా వుండదు. అన్ని రంగాల్లోని సృజనాత్మకతను అతను ఆకళింపు చేసుకుంటూ విశాలమైపోతూ వుంటాడు. మనకు కవులు, గాయకులు, చిత్రకారులు చాలా మందే కనిపిస్తూ వుంటారు. వారు, వారి వారి రంగాలకు కుంచించుకుపోయి వుంటారు తప్ప, ఇతర రంగాల గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేయరు. మానవ జీవితానికి, సమాజ గమనానికి అతి ముఖ్యమైన సైన్సు గురించి అసలే తెలుసుకోరు. అదీ విషాదం! చంద్రశేఖర్ లాంటి వారు అరుదుగా వుంటారు.1936లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ తన తోటి విద్యార్థిని అయిన లలితను పెళ్ళి చేసుకొన్నారు.వారి దాంపత్యం ఆరు దశాబ్దాల పాటు సాగింది. కాని, 1995 ఆగస్టు 21న లలిత ఒంటరిగా మిగిలిపోయింది. జీవిత కాలంలో చంద్ర స్వీకరించిన అవార్డులకు లెక్క లేదు.

ఎఫ్.ఆర్.ఎస్ (1944), ఆడమ్స్ ప్రైజ్ (1948), రాయల్ మెడల్(1962), పద్మభూషణ్ (1968), నోబెల్ ప్రైజ్ (1983) వంటివి ముఖ్యమైనవి. వైజ్ఞానిక రంగంలో ఆయన కృషికి గుర్తుగా 18 విషయాలకు ఆయన పేరు పెట్టారు. చంద్రశేఖర్ లిమిట్; చంద్రశేఖర్ ఎక్స్‌రే అబ్సర్వేటరీ; చంద్ర ఫ్రిక్షన్; చంద్ర పోలరైజేషన్ వంటివి. ఆస్ట్రోఫిజిక్స్, జనరల్ రిలేటివిటి; ప్లూయిడ్ డైనమిక్స్; రేడియేషన్ రంగాలలో ఆయన కృషిని తరువాతి తరాలు అధ్యయనం చేస్తున్నాయి. ‘ఇండియాలో సైన్స్ చెప్పడం కంటే జ్యోతిష్యం చెప్పడం నయం నాలుగు డబ్బులైనా వస్తాయి’ అని అన్నాడోకాయన! అందుకే కదా సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ లాగా నక్షత్రాల అధ్యయనం చేయడం మానేసి, ఎక్కువ మంది జన్మ నక్షత్రాలు చూసే జ్యోతిష్యులవుతున్నారు? అదీ కాని వారు జ్యోతిష్యులు చెప్పేది విని చెవులూపుతున్నారు. ఆలోచనలేని గొర్రెదాటు జనం ఎక్కువవడం వల్ల గొర్రెలు తినేవాడిని తప్పించి, బర్రెలు తినేవాడికి రాజ్యాధికారం అందిస్తున్నారు. హేతుబద్ధతలేని సమాజాలు ఇదిగో ఇలాగే కొట్టుమిట్టాడుతూ, చచ్చిబతుకుతుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News