హైదరాబాద్ : నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సహకార పథకం కింద సబ్సిడి రుణాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అర్హులైన నిరుద్యోగుల నుండి ఈ నెల 19 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. శనివారం హజ్‌హౌస్‌లోని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్ ఈ విషయాన్ని వెల్లడించారు. సబ్సిడీ రుణాల కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందనితెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 15 రోజులు కొనసాగుతుంది. ఆ తర్వాత 15 రోజుల్లో అర్హుల ఎంపిక పూర్తి చేసి ఫిబ్రవరి మాసాంతానికి ఈ ప్రక్రియను ముగిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి స్వయం ఉపాధి రుణాలకు సబ్సిడీ ఇవ్వనున్నారు.
యునిట్ 1 లో 3,500 మందికి రూ. లక్ష , యునిట్ 2లో 1500 మందికి రూ. 2 లక్షల సబ్సిడీ రుణాలు అందించనున్నారు. యునిట్ 1కి 80 శాతం సబ్సిడీ, యునిట్ 2 కింద 70 శాతం సబ్సిడీని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తుంది. అర్హులైన వారు ఈ నెల 19 నుండి రెండు వారాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సబ్సిడీ రుణాలు పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుందని, ఎవరూ దళారులను, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన ముస్లింలు, సిక్కులు, పార్శీలు, బౌద్దులు, జైనులు అర్హులని తెలిపారు. అర్హులైన వారు వ్యాపార యునిట్లు ఏర్పాటు, అభివృద్ధి కోసం దరఖాస్తు చేసుకోవలన్నారు.
దరఖాస్తు దారులు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండి 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, కుటుంబ వార్శికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, లేదా ఆహార భద్రత కార్డు ఉండాలి. వెబ్ పోర్టల్ http://tsobmms.cgg.gov.in, లేదా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్ tsmfc.in ద్వారా ఈ నెల 19 నుండి జనవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రుణాల్లో మహిళలకు 33 శాతం, వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. విలేకరుల స మావేశంలో సంస్థ ఎండి కాంతి వెస్లి ఇతర అధికారులు పాల్గొన్నారు.