ఉత్తీర్ణత సాధించిన 48మంది బాలురు, 42మంది బాలికలు
అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన జెఇఇ మెయిన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో బిసి గురుకుల ఇంటర్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ బాలికల గురుకుల కాలేజీలో చదువుతున్న 120 మందిబాలికలు ఎంట్రెన్స్ పరీక్ష రాయగా వారిలో 42 మంది బాలికలు అర్హత సాధించారు. వీరిలో ఇ. వైష్ణవి (96.78), జి. శ్రీహిత (93.5), బి. వైష్ణవి (93.5), బి. మేఘన(91.5) కె. శిరీష (89.2), ఎ. మేఘన(88.8), ఎన్ . కావేరి(86) శాతం మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 30 మంది బాలికలకు టాప్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇక సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ బాలల గురుకుల కాలేజీలో 128 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా వారిలో 48 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో కె. శ్రీనివాస్(97.51), కెవిఎన్. నీహాల్ (95.49) , కె. అఖిల్(94.53), బి. నిఖిల్ (94.42) శాతం మార్కులు సాధించారు. మంచి మార్కులు సాధించి ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హత సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజెపి సోసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు అభినందించారు.