To understand the heart and mind of a person, look not at what he has already achieved, but what he aspires to. –Khalil Gibran do not let the hero in your soul perish in lonely frustra tion for the life you deserved and have never been able to reach. –Ayn Rand Success usually comes to those who are too busy looking for it. – Henry David Thoreau
ప్రయత్నిస్తుండాలేగాని ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చితీరుతుంది. గట్టిగా పూనిక వహిస్తే, లోలోపల ఆశయం రగులుకుంటే వీధి దీపాల కింద చదివైనా విశ్వవిజేత కావొచ్చు. పెద్దోల్లకే అందలాలు అనే మాట వెనుకటిది. బీదాబిక్కీ సైతం ఊహించని ఎత్తులకు ఎదుగుతున్న కాలమిది. ‘చిన్న లక్ష్యం పెద్ద నేరం; కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ఉద్బోధ చేసిన రోజులకు కాస్త అటూఇటుగా విద్యార్జన చేసిన వాళ్లు ఇప్పటి యువత. పోటీ యుగంలో మొక్కవోని ధైర్యంతో మొక్కదశను దాటి మానుగా ఎదుగతున్న వాళ్లూ వీళ్లే. తమ కళ్ల ముందే తమ ఇరుగూపొరుగు, సహపాఠులు ఎందరో కెరీర్‌లో ఘనవిజయం సాధిస్తుంటే ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్లు కూడా వీళ్లే. జీవితంలో పైకి రావాలనుకుంటున్న ఆశావహులకు ప్రేరణ కల్పిస్తున్న వర్తమాన విజయ గాథలకు కొత్తతరమే ప్రబల సాక్ష్యం. గెలుపును తలధరించడం ఎల్లప్పుడూ యువత చేతిలోని స్వీయ నిర్ణయమేనని తేటతెల్లమవుతున్న సమయం, సందర్భం కూడా ఇదే.
అయితే, ఇప్పుడు యువకులందరూ మొత్తం అంతా గుండుగుత్తాగా ఆశయోన్ముఖులై వర్థిల్లుతున్నారా? అంటే, లేదు అనే చెప్పాలి. తమ తల్లిదండ్రులు స్థితిమంతు లవటాన, తమకు ఏ బరువు బాధ్యతలు తెలియక పోవడం మూలాన విశృంఖలత్వం వెధవాయిత్వం జమిలిగా రోడ్ల మీద విరగబడి నర్తిస్తున్న ఉదంతాలకి తార్కాణగా కంపరం పుట్టిస్తున్న కుర్రకారునూ చూస్తున్నాం. విందులూ వినోదాల్లో చిందేస్తూ భోగలాలసత్వంలోపడి విలువైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ మసకబారుతున్న యవ్వనాన్నీ చూస్తున్నాం. అయినప్పటికినీ తమ కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న ఉక్కు సంకల్పంతో, ఆకలి అవమానాలను తట్టుకొని పట్టుదలే పెట్టుబడిగా రేయింబవళ్లు శ్రమించి పోటీ పరీక్షల్లో ప్రశంసనీయ విజయాలు సాధిస్తున్న యువ ప్రతిభా వంతులూ మన మధ్య వర్థిల్లుతూ ఉన్నారు.
కర్తవ్యపారాయణులే చైతన్య శీలురు. చైతన్య శీలురే కార్యసాధకులు (అచీవర్స్). అచీవర్స్ మొదట ఆశావహులు (ఏస్పిరెంట్స్). ఆశావహులు సాధకులు అయ్యేది అనుకోవడం (To think), ఆచరించడం (To practice) అనే రెండు కార్యాల వల్లనే. బడిలో ‘అ ఆ’లు దిద్దడంతో ఆరంభమయ్యే మన చదువుకు సార్థకత ఏంచేసి బ్రతకాలో అ’నుకోవడం, దాన్ని ఆ’చరించడం అనే మరో ‘అఆ’లలోనే ప్రతిఫలిస్తుంది. అందుకని లక్ష్య సాధనకి ఫార్ములా ఏదున్నా కనీసం పాటించాల్సినవి’ అనుకోవడం , ఆచరించడమేనని జీవిత శిక్షకు (Life coach) లు చెబుతున్న గెలుపు మంత్రం. ఫలితం వచ్చేదాకా ప్రయత్నిస్తుండే సామర్థ్యం, నిరంతరం నేర్చుకునే మనస్తత్వం, స్వీయ పోటీతత్వం, మంచి ప్రణాళిక, మానసిక దృఢత్వం, వైఫల్యానికి సాకులు చెప్పని ఒప్పుకోలు తనం, ఇతరుల పట్ల సహనం ప్రదర్శిస్తూ తన విధ్యుక్త ధర్మం పట్ల కఠినంగా ఉండే వ్యక్తిత్వం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండే నిగ్రహశక్తి, కోరికలు ఇష్టాలు వస్తుకాంక్షల నియంత్రణ, సానుకూల దృక్పథం. అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసం, ఎడతెగని శ్రమ, సృజనాత్మకత, అంకిత భావం ఏ వ్యక్తినైనా విజేతగా నిలబెట్టే ‘అఆ’లోని సద్గుణాలు.
వ్యక్తిత్వ వికాసపులోతులు తెలిసినవాళ్లు ఎవరేం చెప్పినా వినాల్సిన బాధ్యత ప్రతి అభ్యర్థికీ ఉంది. ఒకవేళ నిపుణులు చెవినేస్తున్న థీయరీ కథనాలు అర్థం కాని పక్షంలో ఇదిగో ‘నేను ఎట్లా ఉండాలను కుంటున్నాను అనే విషయమై నేను తీక్షణంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు నా జీవితంపై మిక్కిలి ప్రభావాన్ని చూపిన కొంతమంది వ్యక్తులను నేను నా చుట్టూ ఉండడం చూశాను’ అనే సూక్తి అనుసరించదగినది. అమెరికన్ రచయిత, రాజకీయ వేత్త WesMoore చేసిన ఈ సూక్తి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఉపయోగపడగలదు. గుణవంతులు శ్రేష్టులు కార్యదక్షులను కలుసుకునేందుకు సప్త సముద్రాలు చుట్టి రావాల్సిన అగత్యం ఏదీలేదు. ఒంట్లో చేవ, గుండెల్లో సత్తువ మరింత నింపే ప్రేరణ కోసం సుదూరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మనకు కావలసిన అంతఃశక్తి, ఉన్మిఖీకరణ ప్రాప్తింపజేసే స్ఫూర్తిదాతలు విజేతలు మన చుట్టే మన మధ్యన్నే ఉంటారన్నది మూర్ పండితుడి ముక్తాయింపు. పేదరికం మనుషుల్ని కుంగదీసి ఎట్లా దెబ్ట తీస్తుంటుందో, వెనుకబాటుతనం స్థిత ప్రజ్ఞుల్ని సైతం లొంగదీసుకుని బతుకాశను ఎట్లా చిన్నాభిన్నంచేస్తుందో, అట్లాంటి భయానకమైన పరిస్థితుల్లోంచే వచ్చి అత్యున్నత సివిల్ సర్వీసుకు ఎంపికైన కొందరి నేపథ్యాల్ని యువత ముందుంచుతున్నాను.
ప్రవాహానికి ఎదురీదే సాహసం, విషమ పరిస్థితులను ఎదుర్కొనే సహనం వీళ్ల అనుభవాల ద్వారా విద్యార్థులకు అవగాహనకు రాగలవు. మొదటి ప్రయత్నానికే అలసిపోయి నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న యువకులంతా ఇటీవల ఐఎఎస్ సాధించిన అభ్యర్థుల గతాన్ని మూర్తివంతమైన మనోగతాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సుంది. పేరు విన్నంతనే నరాల్లో ప్రేరణ పొంగి ప్రవహించ గల సివిల్ సర్వెంట్లు ఎందరో మనకున్నారు. వీళ్లలో అన్సార్ అహ్మద్ షేక్ ఒక ఆణిముత్యం. ఇతనో ఆటో డ్రైవర్ కొడుకు. 2015లో తన మొదటి ప్రయత్నంలోనే 21 సంవత్సరాల వయస్సులో ఆల్ ఇండియా ర్యాంక్ 361తో యుపిఎస్‌సిలో ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కుడైన అభ్యర్థిగా రికార్డు సృష్టించాడు. అన్సార్ షేక్ తండ్రి యూనూస్ అహ్మద్ ఆటో డ్రైవర్ కాగా, తమ్ముడు ఒక గ్యారెజ్ మెకానిక్. మహారాష్ట్రలోని జల్నా జిల్లా షెల్గాం గ్రామంలో నివసించే నిరుపేద ముస్లిం కుటుంబం ఈయనది. ఆర్థిక ఇబ్బందులకు ఏరోజూ కుంగిపోలేదు. పుణెలోని ఫర్గూసన్ కళాశాలలో బి.ఎ అయినాక ఐఎఎస్‌పై దృష్టి సారించాడు.
రోజుకు 12 గంటలు చొప్పున మూడు సంవత్సరాలు సీరియస్ గా ప్రిపేరయ్యాడు. మతవివక్షతో సహా అన్ని రకాల అసమానతలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పేద సంప్రదాయవాద ముస్లిం కుటుంబం నుండి వచ్చిన అన్సార్ షేక్ ‘కట్- థ్రోట్ ’ పోటీ ప్రపంచంలో ఐఎఎస్ కలను నిజం చేసుకున్న ప్రజ్ఞాశాలి. సివిల్స్ ప్రిపరేషన్‌లో ఉన్న చాలా మంది ఆశావహులకు ఇతనో సత్య ప్రమాణక ప్రేరణ. ‘మా కుటుంబంలో చదువు ఎప్పుడూ ప్రాధాన్యతగల పదం కాదు. ఆటోడ్రైవర్ అయిన నాన్నకు ముగ్గురు భార్యలు. మా అమ్మ రెండో భార్య. మా తమ్ముడు చదువు మానేశాడు, నా ఇద్దరు చెల్లెళ్లకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు అయినాయి. నేను యుపిఎస్‌సిలో ఉత్తీర్ణత సాధిస్తానని, ఐఎఎస్ అధికారిని అవుతానని చెప్పినప్పుడు ఇంట్లోవాళ్లే ఆశ్చర్యపోయారు, నమ్మలేదు’ అంటున్న అన్సార్ షేక్ ఎంతైనా ప్రశంసనీయుడు. యువత ప్రేరణ పొంది తీరాల్సిన రెండో విజయగాథ కుల్దీప్ ద్వివేది. 27 ఏండ్ల వయస్సులో యుపిఎస్‌సి- 2015 సివిల్ సర్వీస్ పరీక్షలో మూడవ ప్రయత్నంలో 242 ర్యాంక్ సాధించాడితను.
చిన్నతనం నుండి కఠినమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగిన కుల్దీప్ ద్వివేది ఉత్తరప్రదేశ్‌లోని నిగో జిల్లాలోని షేక్‌పూర్ అనే కుగ్రామంలోంచి వచ్చాడు. ఇతని తండ్రి సూర్యకాంత్ ద్వివేది లక్నో యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డు. నెల జీతం కేవలం 1100 రూపాయలే. పిల్లలకు చదువు చెప్పించేందుకు సూర్యకాంత్ పగలంతా పొలాల్లో పని చేసేవాడు. నలుగురు తోబుట్టువులలో కుల్దీప్ చదువులో చురుకైనవాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ పాసయ్యాక 2011లో యుపిఎస్‌సి ప్రయత్నాలను ప్రారంభించాడు. అప్పుడు తన వద్ద మొబైల్ కూడా ఉండేది కాదు. ఢిల్లీలో చిన్న అద్దె గదిలో ఉంటూ కుల్దీప్ సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. స్నేహితుల వద్ద పుస్తకాలు, లాప్ టాప్ తీసుకొని సొంతంగా నోట్స్ రాసుకున్నాడు.
కష్టాలు కడగండ్లూ దాటుకొని లింగ వివక్షను దాటుకొని తనను తాను శిల్పంగా మలచుకున్న శ్వేతా అగర్వాల్ మరో విజయ గాథ. 2016 లో యుపిఎస్‌సిలో 19వ ర్యాంక్ సాధించిన ఈమె తండ్రి ఓ చిన్న కిరాణాకొట్టు నడిపేవాడు. కలకత్తాలో బి.ఎ చదివిన శ్వేతా అగర్వాల్ నాల్గో ప్రయత్నంలో ఐఎఎస్ సాధించింది. ఈమె పుట్టినపుడు ఆడపిల్ల అని ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరట. ఆడపిల్ల చదివిస్తే గొప్పస్థాయికి వస్తుందన్న తన తల్లిదండ్రుల ఆశలను శ్వేతా అగర్వాల్ నిజం చేసింది. నిరీష్ రాజ్‌పుత్ మరో సంచలన గాథ. ఇతని తండ్రివీ రేంద్ర రాజ్‌పుత్ ఒక దర్జీ. మధ్యప్రదేశ్‌లోని భింద్ ఇతని స్వస్థలం. భారీ అసమానతల నడుమ తీవ్ర ఒత్తిళ్లు అంతరాయాల మధ్య ఎంఎస్‌సి పూర్తయ్యాక సివిల్ సర్వీసుకు ప్రయత్నించాడు. పట్టుసడలని దీక్ష ఉంటే పేదరికం అడ్డేకాదని నాల్గో ప్రయత్నంలో 370 ర్యాంకు సాధించి నిరూపించాడు. ఈయన కూడా సొంతంగానే ప్రిపేరయ్యాడు. గ్వాలియర్‌లో ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో విద్యనభ్యసించిన నిరీష్ రాజ్ పుత్ సివిల్స్ కు ప్రిపేరవుతున్న క్రమంలో డబ్బులు సరిపోక న్యూస్ పేపర్లు అమ్మాడు.
సివిల్స్ సాధనలో ఇంకో ఆసక్తికర కథ హృదయ్ కుమార్ ది. ఒడిషాలోని కేంద్రపరా జిల్లాలోని మారుమూల గ్రామమైన అంగులైకి చెందిన ఒక నిరుపేద రైతు కొడుకీయన. ఉత్కళ్ యూనివర్సిటీలో ఎం.సి.ఎ చదివిన హృదయ్ కుమార్ రెండు సార్లు విఫలమైనా లక్ష్యం నుంచి దూరం జరగలేదు 2014 సివిల్స్ పరీక్షలో 1079వ ర్యాంక్ సాధించాడు. ఉండటానికి సరియైన ఇల్లు కూడా లేని కడు బీద స్థితి నుంచి ఐఎఎస్ కలను నిజం చేసుకున్న కృషీవలుడు హృదయ్ కుమార్. అట్లాగే ప్రేరణకు పర్యాయ పదాలైన మనోజ్ కుమార్ రాయ్ ఐఏఎస్ ఒకప్పుడు కోడిగుడ్ల వ్యాపారి, కె.జయగణేశ్ ఐఏఎస్ ఒక వెయిటర్. గోవింద జైస్వాల్ ఐఎఎస్ ఒక రిక్షా పుల్లర్ కొడుకు. వీళ్లందరినీ గమనిస్తే ‘జ్ఞానం మీద పెట్టుబడి ఎల్లప్పుడూ ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంద’న్న జిమన్ ఫ్రాంక్లిన్ కొటేషన్ గుర్తొస్తుంది. అచీవర్స్ కు ఉండాల్సినవి డబ్బు దస్కం కాదు ‘మెంటల్ ఫిట్ నెస్, ఎమోషనల్ ఫిట్ నెస్, ఫిజికల్ ఫిట్ నెస్, నాలెడ్జ్ ఫిట్ నెస్’ అంటాడు మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్. ఇందరి గెలుపు కథలు సూత్రాలు విన్నారు కదా, మరింకెందుకు ఆలస్యం? భారత భాగ్యవిధాతలారా! లెండి, విధిరాతను తిరగ రాయండి, ఏదనుకుంటున్నారో దాని సాధనకై పూనుకొండి. గమ్యాన్ని ముద్దాడే దాకా అయాన్ ర్యాండ్ చెప్పినట్టు మీలోని ‘హీరో’ను ఒంటరిని చేసి చంపకండి, ఆశయానికి అమృతం పట్టండి. ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు ‘ఇది వరకు మీరేం చేశారనే దాని కంటే, ఇప్పుడు మీరేం సాధించదలచార’న్నదే కీలకం. ‘విజయం సాధారణంగా దాని కోసం చాలా బిజీగా ఉన్నవారికి వస్తుంద’న్న డేవిడ్ హెన్రీ థోరో వ్యాఖ్యను నిజం చేయండి. సివిల్స్ అనే కాదు ఏదో ఒకటి సాధించడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి.
డా. బెల్లియాదయ్య
9848392690