న్యూఢిల్లీ : భారత నౌకాదళం మంగళవారం మరో ఘన విజయం సాధించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడో ( జలాంతర్గామి విధ్వంసక క్షిపణి)ను మంగళవారం పరీక్షించింది. సముద్ర గర్భంలో ఉన్న లక్షాన్ని ఈ టార్పిడో విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈమేరకు సంబంధిత ఎనిమిది సెకండ్ల వీడియో క్లిప్‌ను నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పొడవైన రంగురంగుల వస్తువు సముద్ర ఉపరితలంపై ఉన్నట్టు ఈ వీడియోలో కనిపించింది.
ఆ వస్తువు అకస్మాత్తుగా పేలిపోవడం కనిపించింది. సముద్రగర్భం లోని లక్షాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డిఆర్‌డివొ సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలకమైన మైలురాయి. స్వయం సమృద్ధ భారత్ లక్ష సాధనలో ఇది గొప్ప ముందడుగు , ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్తులో మా పోరాట సంసిద్థతకు ఇది నిదర్శనం ” అని నేవీ వెల్లడించింది. అయితే ఈ టార్పిడో పేరు లేదా ఇతర ఫీచర్లు గానీ నేవీ ఇప్పుడే వెల్లడించలేదు. హిందూ మహాసముద్రంలో చైనా కారణంగా పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని నేవీ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే భారత నౌకాదళానికి వరుణాస్త్ర అనే అధిక బరువు గల టార్పిడో ఉంది.
ఇది నీటి అడుగు నుంచి ప్రయోగించే స్వయం చోదిత క్షిపణి. 30 కిలో మీటర్ల దూరంలో ఉండే లక్షాలను ఛేదించడానికి, జలాంతర్గామి నుంచి శత్రునౌకల పైకి దీన్ని ప్రయోగిస్తారు. విశాఖ పట్టణం లోని ఎన్‌టీఎస్‌ఎల్ (నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ) దీన్ని అభివృద్ధి చేసింది. ఇదిలా ఉండగా భారత నావికా దళం మే 31న మరో రికార్డు సృష్టించింది. మనదేశం లోనే డిజైన్ చేసి, నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ పైకి ఎంహెచ్60 ఆర్ హెలికాప్టర్ దిగింది. దీనివల్ల జలాంతర్గాముల నిరోధక యుద్ధంలో నావికాదళం మరింత బలోపేతమైంది. ఎంహెచ్ 60 అనేది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలిగే హెలికాప్టర్. ఇది మల్టీరోల్ హెలికాప్టర్.
Successful engagement of an Underwater Target by an indigenously developed Heavy Weight Torpedo is a significant milestone in #IndianNavy's & @DRDO_India's quest for accurate delivery of ordnance on target in the underwater domain. #AatmaNirbharBharat@DefenceMinIndia pic.twitter.com/ZMSvtFSobE
— SpokespersonNavy (@indiannavy) June 6, 2023