మొదటిసారిగా విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
19ఏళ్ల యువతికి బ్రెయిన్‌డెడ్ మహిళ లంగ్స్‌ను అమర్చిన వైద్యులు
కొవిడ్ తర్వాత దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో జరిగిన మొదటి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) లో తొలిసారి ఊపిరితిత్తుల అవయవ మార్పిడి శస్త్రచికిత్సను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన 47 ఏళ్ల వయసున్న ఓ మహిళ ఊపిరితిత్తులను మాదాపూర్‌లోని మెడికోవర్ ఆస్పత్రి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌కు గ్రీన్ చానెల్ ద్వారా తరలించారు. నిమ్స్‌లో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారా కొవిడ్‌తో బాధపడుతున్న 19 ఏళ్ల యువతికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులను అమర్చారు. సికింద్రాబాద్ తాడ్బంద్కు చెందిన సుశీలా(47) నవంబర్ 27వ తేదీన బోయిన్‌పల్లి మెయిన్ రోడ్డు క్రాసింగ్ వద్ద బైక్ పై నుంచి కింద పడి కోమాలోకి వెళ్లారు. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మేడికోవర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగపడలేదు. ఆమె మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన 19 సంవత్సరాల యువతి 11 నెలల క్రితం కొవిడ్ బారిన పడి ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆమె మూడు నెలల క్రితం నిమ్స్ చేరి చికిత్స పొందుతున్నారు. ఆమె ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్, వెంటిలేటర్ నుంచి ఎక్మో వరకు వెళ్లింది. బుధవారం తెల్లవారు జామున మీ పాపకు బ్రెయిన్‌డెడ్ అయిన ఓ మహిళ ఊపిరితిత్తులు లభించాయి, సర్జరీ చేస్తామని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బ్రెయిన్‌డెడ్ అయిన మహిళకు సర్జరీ చేసి ఆ మహిళ అవయవాలను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఉదయం 7.40 గంటలకు మెడికోవర్ ఆసుపత్రి నుంచి 7.51 నిమిషాలకు పంజాగుట్టలోని నిమ్స్ ఊపిరితిత్తులు చేరుకోగా, వెంటనే కొవిడ్‌తో బాధపడుతున్న యువతికి వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించారు. ఆ యువతికి విజయవంతంగా ఊపిరితిత్తులను అమర్చారు. కొవిడ్ తర్వాత దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో జరిగిన మొదటి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ఇది.