Monday, December 23, 2024

శివసేనలో వారసత్వ పోరు!

- Advertisement -
- Advertisement -

Succession fight in Shiv Sena..!

2019లో తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని 24 గంటల లోపుగానే కూల్చివేసి, తమ రాజకీయ ప్రత్యర్ధులైన్ ఎన్‌సిపి, కాంగ్రెస్ లతో చేతులు కలిపి ప్రభుతాన్ని ఏర్పాటు చేసిన థాకరేపై కక్ష తీర్చుకోవడానికి బిజెపికి మరెవ్వరికీ లేనన్ని వనరులు, కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ రెండేళ్లకుపైగా పట్టింది. ప్రభుత్వంనైతే పడగొట్టారు గాని ఆ తర్వాత ముందుకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను, పుష్కలంగా ఆర్ధిక వనరులను ఉపయోగించి ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర వహించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి రావడంతో మొదట ఖంగు తినవలసి వచ్చింది. ఇక ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని స్పష్టం అవుతున్నది. మరోవంక మంత్రివర్గ విస్తరణకు నెల రోజులు దాటినా సాహసింపలేకపోతున్నారు.
ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం రెండేళ్ల పాటు మనుగడ సాగిస్తుందని మొదట్లో ఎవ్వరూ అనుకోలేదు. అయితే ప్రభుత్వాన్నికూల్చివేసిన తీరు చూస్తుంటే ఆయనకు శివసైనికులలో మాత్రమే కాకుండా సాధారణ ప్రజలలో కూడా అనూహ్యమైన సానుభూతి వ్యక్తం అవుతున్నది. అదే ఇప్పుడు బిజెపికి కటకప్రాయం అవుతున్నది. హిందుత్వ విషయంలో మొదటి నుండి థాకరే కుటుంబంతో బిజెపి పోటీ పడలేకపోతున్నది. శివసైనికులు అధికారంలో ఉన్నప్పుడుకన్నా లేనప్పుడే ప్రమాదకరమని గతంలో పలు సందర్భాలలో స్పష్టమైనది.అందుకనే థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టే ముందు కేంద్రం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను ముంబైకి పంపింది. పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్యలు తలెత్తగలవని భయపడింది. అయితే ఉద్ధవ్ తండ్రికన్నా భిన్నంగా సౌమ్యుడు కావడమే కాకుండా, శివసైనికులను అదుపు చేయడంలో విజయం సాధించారు. శివసైనికులు అంటేనే రాజకీయ పరిభాషలో ‘వీధి రౌడీలు’ అన్న నానుడి చాలా కాలంగా ఉంది. బాల్ థాకరే సజీవంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పటికీ, మనవడు ఆదిత్య ఇంకా కాలేజీలో చదువుతున్నప్పుడు, శివసేనకు యువజన విభాగాన్ని స్థాపించాలని కోరుకున్నారు. అయితే యువ సేన ఏర్పాటును థాకరే తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎందుకంటే శివసేన ఎల్లప్పుడూ యువ, కండలు తిరిగిన మహారాష్ట్ర కుర్రాళ్ల పార్టీగా ఉండేది. వారు ఒక్క క్షణంలో బాలా సాహెబ్‌ను చుట్టు ముట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నా తల పై వెంట్రుకను పట్టుకున్నా ముంబయి వీధులన్నీ రక్తంతో నిండిపోతాయి! అని ఆయన బెదిరించడం మనం ఎన్నో సార్లు చూసాము. థాకరే శివసైనికుల సైన్యం నిరుద్యోగ యువకులు కావడం వల్ల ఆయన అటువంటి విశ్వాసం వ్యక్తం చేయగలిగేవారు.వారు తమ సొంత రాష్ట్రంలో దక్షిణ భారతీయులు వైట్ కాలర్ ఉద్యోగాలను తీసివేసుకొనేవారని ఆగ్రహంగా ఉండేవారు. థాకరే ముంబై టెలిఫోన్ డైరెక్టరీ నుండి తీసిన జాబితాలను ప్రచురించి, దక్షిణ భారతీయులు మొదటి మూడు తరగతుల ఉద్యోగాలలో ఎంత ఎక్కువగా ఉండేవారో చూపించేవారు.
చివరికి ఉత్తర భారతీయులు ముంబై అంతటా అసంఘటిత రంగంలోకి ప్రవేశించారు. టాక్సీ డ్రైవర్లు, చేపలు అమ్మేవారు, పాన్‌వాలాలుగా ఉండేవారు. చివరకు ఎక్కువ విద్యావంతులైన మధ్యతరగతి మహారాష్ట్రీయులు నిరుద్యోగులుగా మిగిలేవారు. థాకరే ప్రతి సేన శాఖ వద్ద లోక్ అధికార్ సమితిలను ఏర్పాటు చేశారు. ఇది అన్ని కార్యాలయ ఖాళీలను నిశితంగా పరిశీలించి, బయటి వ్యక్తుల కంటే స్థానిక అబ్బాయిలను నియమించుకోవాలని యజమానులపై ఒత్తిడి తెచ్చేడిది.
అయితే, ఆదిత్య కళాశాలలో ప్రవేశించే సమయానికి పరిస్థితులు మారాయి. ఇంతకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు పొందడం మాత్రమే కాకుండా, అప్పటికి వారు మధ్య వయస్కులైన మధ్యతరగతి వారీగా వివిధ ఆర్ధిక రంగాలలో చొచ్చుకు పోవడం ప్రారంభించారు. దానితో ఇప్పుడు శివసేన మద్దతు స్వరూపం మారిపోయింది. అందుకు ఉద్ధవ్ సానుకూల స్వభా వం, ఆదిత్య ఆధునిక ధోరణులు అద్దం పడుతున్నాయి. ఈ పరిణామాలను అర్ధం చేసుకోలేని బిజెపి బాల్ థాకరే నాటి వీధి పోరాటాలకు ప్రతినిధిగా నిలిచినా ఏకనాథ్ షిండేను దగ్గరకు తీసి, శివసేన ఎమ్యెల్యేలతో చీలిక అయితే తీసుకు వచ్చింది గాని, శివసైనికులను ఏ మేరకు చీల్చారన్నది సందేహాస్పదమే. అతను ముందు మరో అటువంటి నేపథ్యం గల నారాయణరానేకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా చెప్పుకోదగిన ప్రయోజనం లేకపోయింది.
శివసేనను బిజెపికి దూరం చేయడంలో కీలక భూమిక వహించిన సంజయ్ రౌత్‌ను జైలులో పెట్టి ఉద్ధవ్‌ను భయపెట్టి కాళ్ల బేరానికి తెచ్చుకోవాలనే ఎత్తుగడ కూడా ఫలించలేదు. అయితే ఒక వ్యక్తి ఛరిష్మాతో ఏర్పడిన పార్టీల వారసత్వం చట్టసభలలో బలంపై ఆధారపడవని గతంలో అనేక సందర్భాలలో స్పష్టమైనది. శివసేనతో సహితం గతంలో పలువురు బలమైన నాయకులు అటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. బాల్ థాకరే వలె కనిపించడమే కాకుండా, అదే విధమైన ఆహాభావాలు ప్రదర్శించే రాజ్ థాకరే అటువంటి ప్రయత్నం చేసి శివసైనికుల విశ్వాసం పొందలేకపోవడం చూశాము. వాస్తవానికి ఉద్ధవ్‌లో ఏ విధంగా చూసినా తండ్రివలె వ్యవహరించడం లేదు. అయినా గత పలు సంవత్సరాలుగా శివ సైనికులు ఆయనకే మద్దతు ఇస్తూ వస్తున్నారు. బిజెపి అండదండలతో ఎన్నికల కమిషన్ ద్వారా శివసేన ఎన్నికల గుర్తును షిండే వర్గం ఏదోవిధంగా కైవసం చేసుకోవచ్చు లేదా ఆ గుర్తు ఎవరికీ చెందకుండా అడ్డుకోవచ్చు. అంతమాత్రం చేత బాల్ థాకరే వారసునిగా షిండేను గుర్తిస్తారని చెప్పలేము.1969లో భారత జాతీయ కాంగ్రెస్‌లో ఏర్పడిన మొదటి చీలికను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ, పార్టీలో వృద్ధ నాయకుల నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం కాడి జోడెద్దులును నాడు తమదే అసలు కాంగ్రెస్‌గా భావిస్తున్న పాత కాంగ్రెస్ నిలుపుకొంది.
ఇందిరా గాంధీ కొత్తగా ఆవు, దూడ గుర్తుతో ఎన్నికలకు వెళ్లారు. రెండు సంవత్సరాల తరువాత 1971లో ఆమె లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగా ఘన విజయం సాధించారు. పాత కాంగ్రెస్‌కు చెందిన కామరాజ్, నిజలింగప్ప, వైబి చవాన్, మొరార్జీ దేశాయ్ వంటి మహామహులను మట్టికరిపించారు. తిరిగి ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ విభజనలో అదే కథ పునరావృతమైంది. ఈసారి ఎన్నికల కమిషన్ ఆవు, దూడ చిహ్నాన్ని స్తంభింప చేయడంతో అసలు ఏమాత్రం సంబంధం లేని హస్తం గుర్తుతో ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్లారు. అయితే ఎన్నికల్లో మరోసారి ఆమె విజయం సాధించారు. ఆమెను పార్టీ నుండి బహిష్కరించిన పెద్దలే తిరిగి ఆమె పార్టీలో చేరారు. దానికే ‘గృహ ప్రవేశం‘ అంటూ పార్టీ ఫిరాయింపులకు సరికొత్త పేరు పెట్టారు.
బాల్ థాకరే రాజకీయ ప్రస్థానం వీధి పోరాటాల నుండి ప్రారంభమైనదని గుర్తించాలి. వీధి గుండాలను ఎంచుకొని వారిని రాజకీయ నాయకులుగా మార్చడంలో బాల్ ఠాక్రేకు అద్వితీయ ప్రతిభ ఉందని శరద్ పవార్ గతంలో ఒకసారి చెప్పారు. ప్రస్తుతం బిజెపి సభ్యునిగా, కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నారాయణ్ రాణే, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గురువు ఆనంద్ దిఘే అటువంటి వారే. షిండే నేపథ్యం కూడా అంతకన్నా భిన్నం కాదు. తామే బాల్ థాకరేకి నిజమైన ‘హిందుత్వ’ వారసులమని ప్రజలను నమ్మించేందుకు ఇప్పుడు షిండే, ఫడ్నవీస్ ఎంతగానో తంటాలు పడుతున్నారు. ఈ సందర్భంగా బాల్ థాకరే చిన్న కొడుకు నుండి గతంలో విడాకులు తీసుకున్న కోడలు స్మితా ఠాక్రేను దగ్గరకు తీస్తున్నారు.
ఆమె చాలా కాలంగా అసెంబ్లీ లేదా పార్లమెంటుకు టిక్కెట్టు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఉద్ధవ్ థాకరేతో పాటు రాజ్ థాకరే కూడా పట్టించుకోవడం లేదు. బాలాసాహెబ్ చనిపోయే ముందు కూడా, 2009లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ నిరాకరించినట్లయితే కాంగ్రెస్‌లో చేరతానని స్మిత బెదిరించారు. ఏ దేమైనా ఆమెకు ఇప్పటికీ సీట్లు రాలేదు. ఆమె కాంగ్రెస్‌లో చేరలేదు. ఏమైనా ప్రజల దృష్టిలో ఉద్ధవ్, ఆదిత్య నిజమైన ఠాక్రేలు. ప్రజలతో నేరుగా సంబంధాలకు ఆదిత్య చేపట్టిన శివ సంవద్ యాత్ర కు లభించిన అపూర్వ ప్రజాదరణ ఆ అంశాన్ని వెల్లడి చేస్తుంది. 2019లో ఉద్ధవ్ థాకరే ఇంటికి స్వయంగా వెళ్లి అమిత్ షా హామీ ఇచ్చినట్లు చెబుతున్నా, చెరి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఒప్పందంకు కట్టుబడి ఉంటే, ఈ పాటికి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తి చేసుకున్నా, ఫడ్నవీస్ ఆ కుర్చిలోకి వచ్చేవారు. రాజకీయాలలో దూరదృష్టి, వ్యూహాత్మకంగా అడుగులు వేయడం అవసరం. అదేమీ కాకుండా అహంకారంగా వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలే వస్తాయి.

Succession fight in Shiv Sena..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News