Monday, December 23, 2024

ఆ సిఇఓ కొడుకును ఎందుకు చంపిందంటే…

- Advertisement -
- Advertisement -

కలతల్లేని కాపురం ఉంటుందా? భార్యాభర్తలన్నాక గొడవలు పడటం, సర్దుకోవడం సాధారణమే. భర్తపై ఎంతకోపం ఉన్నా ఆ కోపాన్ని కన్నబిడ్డలపై చూపి, వారి ప్రాణాలు తీసే తల్లుల్ని ఎక్కడా చూడం. కానీ గోవాలో జరిగిందదే. మాజీ భర్తను కలవడం ఇష్టం లేక కన్న కొడుకునే చంపుకున్న సిఇఓ సుచన గురించి తెలిసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 2021 టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఎథిక్స్”లో సుచన ఒకరు కావడం విశేషం.

సుచనా సేథ్ ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్. మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ పేరిట ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని బెంగళూరులో నడుపుతోంది. తను హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న విద్యాధికురాలు కూడా. పైగా ఆమె స్వయంగా ఒక డేటా సైంటిస్ట్. ఇంత చదువుకుని, సమాజంలో పేరు, హోదా కలిగిన ఓ మహిళ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.

సుచన శనివారం మధ్యాహ్నం గోవాలోని ఓ హోటల్లో దిగింది. ఆమెతో పాటు ఆమె నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. సోమవారం చెకౌట్ చేసినప్పుడు మాత్రం ఆమె వద్ద ఒక పెద్ద బ్యాగు మాత్రమే ఉంది. ఆమె వెంట కుమారుడు లేకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. బెంగళూరుకు టాక్సీ బుక్ చేయాలని హోటల్ సిబ్బందిని ఆమె కోరింది. విమానంలో వెళ్లమని వారు సలహా ఇవ్వగా, టాక్సీలోనే వెళ్తానని పట్టుబట్టింది. దాంతో టాక్సీ బుక్ చేసి పంపించారు.

తీరా హోటల్ గదిని చెక్ చేస్తే, రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సుచనను మార్గమధ్యంలో అడ్డగించి, కుమారుడి గురించి ప్రశ్నిస్తే తన స్నేహితురాలు తీసుకువెళ్లిందని చెప్పింది. అయితే ఆమె ఇచ్చిన స్నేహితురాలి అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. ఆమె బ్యాగ్ లో కుమారుడి మృతదేహాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

సుచనకు 2010లో పెళ్లయింది. వీరికి 2019లో కుమారుడు పుట్టాడు. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలు కావడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నెలలో ఒకరోజు ఆమె భర్త కుమారుణ్ని కలవవచ్చు. ఆమేరకు కొడుకుని చూసేందుకు తాను వస్తున్నట్లు భర్త ఫోన్ చేయడంతో సుచన సహించలేకపోయింది. భర్తకు కొడుకుని చూపించడం ఇష్టం లేని సుచన గోవాకు వెళ్లి… అక్కడ కుమారుణ్ని చంపేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News