Sunday, December 22, 2024

సిరప్ మత్తు.. దిండుతో ఊపిరాడకుండా చేసిన తల్లి

- Advertisement -
- Advertisement -

పనాజీ : ఏం కక్ష ఎందుకు పెంచుకుందో తెలియదు . తన నాలుగేళ్ల కన్నకొడుకును చంపిన తల్లి , సిఇఒ సుచన సేథ్ ఈ దారుణానికి అత్యంత వ్యూహాత్మకంగా, ముందస్తు పథకం ప్రకారం పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఎఐ స్టార్టప్ నడిపిస్తున్న తల్లి చేతుల్లో దారుణంగా గోవాలో బలి అయిన బాలుడి అంత్యక్రియలు బుధవారం జరిగాయి. చిత్రదుర్గ జిల్లాలోని హిరయూర్‌లోని రాజాజీనగర్‌లోని హరిశ్చంద్ర ఘాట్‌లో ఈ బాలుడికి తండ్రి వెంకటరమణ కన్నీటిపర్యంతం దశలో తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది. విదేశాలలో ఉంటున్న తండ్రి కుమారుడి విషాదాంతం వార్త తెలియగానే బెంగళూరుకు వచ్చాడు . ఈ హత్యోదంతంలో గోవా పోలీసులు సాగించిన దర్యాప్తు క్రమంలో తల్లి ఈ బాబును ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపివేసినట్లు తెలిసింది. మైండ్‌ఫుల్ ఎఐ సంస్థ సిఇఒ బస చేసిన గోవాలోని అతిధిగృహం గదిలో రెండు మూడు దగ్గు మందు బాటిల్స్‌ను స్వాధీనపర్చుకున్నారు.

ముందుగా వీటిని బాలుడికి తాగించి ఈ 39 ఏండ్ల యువతి ఆ తరువాత దిండుతో కానీ దుప్పటితో కానీ గొంతు నులిమి చంపివేసి ఉంటుందని , తరువాత తానూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని సాధ్యం కాకపోవడంతో బాలుడి శవాన్ని సూట్‌కేసులో తీసుకుని టాక్సీలో బెంగళూరుకు వచ్చిందని ప్రాధమికంగా నిర్థారించారు. ఇంతవరకూ ఈ దారుణానికి తల్లి ఎందుకు పాల్పడిందనేది వెల్లడికాలేదు. తండ్రి అనుమతి తరువాత బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలో బాలుడు ఊపిరాడని స్థితిలోనే చనిపోయినట్లు గుర్తించారు. భర్తతో ఇప్పుడున్న విడాకుల వ్యాజ్యం విషయంలో సేథ్ విసిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. బాలుడు తనకు దక్కుతాడా? భర్తకు చెందుతాడా? అనే మీమాంస చివరికి ఆమెను మానసిక ఉన్మాద స్థితికి చేర్చి ఉంటుందేమో అనే వాదనలు కొందరు సైకియాట్రిస్టులు వెలువరించారు.

ఆమె బాబుతో బస చేసిన సర్వీసు అపార్ట్‌మెంట్ రూంలో దగ్గుమందు బాటిల్స్‌ను ఇక్కడ తనిఖీలు చేసిన సీనియర్ పోలీసు అధికారి గుర్తించారు. దగ్గుమందు మత్తులో బాబు ఉన్నప్పుడే తల్లి అంతమొందించి ఉంటుందని పోస్టు మార్టం తరువాత తేల్చిన విషయాలతో వెల్లడైంది. శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. పెనుగులాటల గుర్తులు కూడా లేవని నిర్థారించారు. ముందుగా అన్ని ఆలోచించుకునే ఈ యువతి బాబును ఇక్కడికి తీసుకువచ్చి చంపేసి ఉంటుందని తెలిపే ఆధారాలు ఎక్కువగా లభించాయి.

చంపలేదు…చనిపోయి ఉన్నాడు విచారణ దశలో చెప్పిన సుచన
పోలీసుల విచారణ దశలో ఈ తల్లి సుచన తాను బాబును చంపలేదని , తాను నిద్రపోయి లేచి చూసే సరికి బాబు చలనం లేకుండా పడి ఉన్నాడని కూడా తెలిపినట్లు వెల్లడైంది. అయితే శవాన్ని తీసుకుని బెంగళూరుకు ఎందుకు వెళ్లుతున్నట్లు ? అని ప్రశ్నించగా సరైన సమాదానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ వాదన తమకు నమ్మశక్యంగా లేదని వారు పేర్కొన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తరువాతనే నిజాలు మరింతగా వెలుగులోకి వస్తాయని , బాబును ఎందుకు చంపివేసిందనేది కూడా తరువాత తెలుస్తుందని, ఇప్పటికైతే తమకు తెలిసింది కేవలం భార్యభర్తలు తగవులు పడి విడిపోయి ఉంటున్నారు. విడాకులకు కోర్టుకు వెళ్లారు. బాబు తల్లితో పాటు ఉంటున్నాడనేదే అని పోలీసు వర్గాలు తెలిపాయి. బాలుడి తండ్రి వెంకటరమణ కేరళకు చెందిన వాడు, ఇప్పుడు ఇండోనేసియాలోని జకార్తాలో ఉంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు బాబు మృతి తరువాత చిత్రదుర్గ జిల్లాలోని హరియూర్‌కు వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News