Monday, December 23, 2024

శరణార్థుల రాకపై ఈజిప్టు ఆందోళన

- Advertisement -
- Advertisement -

కైరో: గాజా ప్రాంతంలోని సగం జనాభాను 24 గంటల్లోగా ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో అక్కడి నుంచి శరణార్థులు తమ దేశంలోని పెద్ద ఎత్తున వచ్చి పడతారని ఈజిప్టు ఆందోళన చెందుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు మొదలైనప్పటినుంచి కూడా ఈజిప్టు గాజాప్రాంతంనుంచి శరణార్థులు తమ దేశంలోకి పెద్ద ఎత్తున రాకుండా చూడడానికి తమ దేశ సరిహద్దుల గుండా గాజా ప్రాంతంలోకి ఆహారం, ఇతర మానవతా సహాయం వెళ్లేలా చూడడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే తమ ప్రయత్నాలకు ఇజ్రాయెల్‌నుంచి ఎలాంటి స్పందనా లేదని ఈజిప్టు అధికారులు అంటున్నారు. కాగా ఈ వారాంతంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కైరో సందర్శించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈజిప్టు అధికారులు ఈ వ్యవహారంపై ఆయనతో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ ఇప్పటికే దాదాపు 23లక్షల మంది ఉన్న గాజా ప్రాంతానికి ఆహారం, నీరు సహా అన్ని సరఫరాలను బంద్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈజిప్టులోని రఫా క్రాసింగ్ ఒక్కటే గాజా ప్రాంతానికి సరఫరాలకు ఏకైక మార్గంగా మిగిలింది. అయితే ఎడతెగని ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఈ క్రాసింగ్‌కు కూడా పని చేయడం లేదు. దీంతో పాలస్తీనాలోకి సరకులు తీసుకెళ్లాల్సిన వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనా వైపునుంచి పెద్దఎత్తున శరణార్థులు తమ దేశంలోకి వస్తారేమోనని ఈజిప్టు ఆందోళన చెందుతోంది. కాగా, ఆహార సరఫరాల కోసం గాజా ప్రాంతంలో కొన్ని సేఫ్ జోన్లను ఏర్పాటు చేసే విషయమై ఇజ్రాయెల్, ఐరాస ఏజన్సీలు, రెడ్‌క్రాస్‌కు చెందిన అంతర్జాతీయ ఏజన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ సహాయం వచ్చేది ఈజిప్టునుంచా లేక ఇజ్రాయెల్‌నుంచా అనేది మాత్రం తెలియరాలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News