Friday, November 15, 2024

కన్నడ పవర్‌స్టార్ పునీత్ హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

Sudden death of Kannada power star Puneet

గుండెపోటుతో జిమ్‌లో కుప్పకూలిన కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు

బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో కన్నుమూత
శోక సముద్రంలో కర్నాటక
ప్రముఖుల సంతాపాలు

కన్నడ స్టార్ హీరో, పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఇంట్లోని జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

46 ఏళ్ల చిన్న వయసులోనే పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. షాక్‌కు గురైన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కన్నడ పవర్ స్టార్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్నాటక ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రి ఆవరణతో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ ఇంటికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పునీత్ భౌతిక కాయాన్ని ముందుగా ఆయన నివాసానికి అనంతరం అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి తరలించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

కర్నాటక లెజండరీ యాక్టర్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు 1975వ సంవత్సరం మార్చి 17న ఆయన జన్మించారు. బాలనటుడిగా ఆయన పలు సినిమాల్లో నటించారు. 1985వ సంవత్సరంలో ‘బెట్టాడ హువు’ అనే చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అదే సమయంలో చలిసువ మొదగలు, ఎరడు నక్షత్రగలు సినిమాలకు గానూ కర్నాటక రాష్ట్రప్రభుత్వం ఉత్తమ బాలనటుడిగా ఎంపిక చేసింది. 2002వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అప్పు సినిమాతో హీరోగా పునీత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే పునీత్‌ను అప్పు అని ఫ్యాన్స్ పిలుచుకోవడం ప్రారంభించారు. ఇక అప్పు సినిమా తెలుగులో ’ఇడియట్’ పేరుతో రీమేక్ కాబడి ఘన విజయం సాధించింది.

హీరోగా ఇప్పటివరకు పునీత్ 32 చిత్రాల్లో నటించారు. గాయకుడిగా కూడా మెప్పించారు. వీర కన్నడిగ, అజయ్, భాగ్యవంత, ఏడు నక్షత్రాలు, భక్త ప్రహ్లాద, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆయన నటించిన యువరత్న సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 1999 సంవత్సరం డిసెంబర్ 1న అశ్వనీ రేవంత్‌ను పునీత్ రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయిన ఆమెను ఇష్టపడి పెద్దల అంగీకారంతోనే పెళ్లాడారు. ఆ దంపతులకు ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

టాలీవుడ్‌తో విడదీయలేని బంధం…

అపజయం లేకుండా సినిమా కెరీర్ సాగించిన పునీత్ రాజ్ కుమార్‌కు తెలుగు సినిమాతో విడదీయ లేని బంధం ఉంది. టాలీవుడ్ ప్రముఖులతో ఆయన మంచి స్నేహాన్ని కొనసాగించేవారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆంధ్రావాలా’ చిత్రాన్ని కన్నడలో ‘వీర కన్నడిగ’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు పునీత్. దీనికి తెలుగు దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అలానే మహేష్ బాబు, – గుణశేఖర్ కలయికలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాను ‘అజయ్’ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రాన్ని కూడా మెహర్ రమేష్ తెరకెక్కించడం గమనార్హం. రవితేజ, – పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ’‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాని కన్నడలో పునీత్ ‘మౌర్య’ గా రీమేక్ చేశారు. అలాగే మహేష్ బాబు, – శ్రీను వైట్ల కలయికలో రూపొందిన ‘దూకుడు’ మూవీ రీమేక్‌లో కూడా పవర్ స్టార్ నటించారు. ‘పవర్’ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్‌పై తెలుగు నిర్మాతలు రామ్ ఆచంట, – గోపీ ఆచంట, – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

ఇక తనను పవర్ స్టార్ అని పిలవొద్దని.. అది పవన్ కళ్యాణ్‌కు మాత్రమే వర్తిస్తుందని చెప్పడం ఆయన స్వభావాన్ని తెలియస్తుంది. ‘పవర్’ ఆడియో ఫంక్షన్‌కు చీఫ్ గెస్టుగా హాజరైన మహేష్ బాబుతో కూడా పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. అలానే పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమా కోసం తమన్ సంగీత సారథ్యంలో ఎన్టీఆర్ ‘గెలయా…’ అనే సాంగ్ పాడి అలరించారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని పునీత్ చెబుతుంటారు. ఇక చివరగా పునీత్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యువరత్న’ సినిమా కన్నడతో పాటుగా తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జేమ్స్, ద్విత్వ చిత్రాలను కూడా తెలుగులో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించకుండానే పునీత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

సినీ ప్రముఖుల సంతాపం…

పునీత్ మరణంతో శాండల్‌వుడ్ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ మృతి వార్త తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. “పునీత్ మరణవార్త విని షాక్ అయ్యాను. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు. పునీత్ నాకు అత్యంత ఆప్తుడు. వారి కుటుంబంలోని వారంతా నాకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త తెలియగానే నా నోట మాట రాలేదు” అని మెగాస్టార్ అన్నారు. పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇది నమ్మశక్యం కాలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా”అని తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ “పునీత్ రాజ్‌కుమార్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అతని ఆత్మకు శాంతి కలగాలి”అని చెప్పారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ “పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.

నేను కలిసిన, మాట్లాడిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం”అని అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ “నా హృదయం ముక్కలైంది. మమ్మల్ని వదిలి మీరు ఇంత త్వరగా వెళ్లిపోయారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా”అని చెప్పారు. – మోహన్ బాబు మాట్లాడుతూ “పునీత్ రాజ్‌కుమార్ చాలా మంచి మనిషి. భగవంతుడు కొన్ని సందర్భాల్లో ఎందుకిలా చేస్తాడో నాకు అర్థంకాదు. యావత్ సినీ ప్రపంచానికి విషాదకరమైన రోజు ఇది”అని పేర్కొన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ “పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరన్న వార్త విని షాకయ్యా. అద్భుతమైన వ్యక్తి అతను. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం విచారకరం. ఒకట్రెండు సార్లు మాత్రమే ఆయనను కలిశా. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఆతిథ్యం, చూపించిన ప్రేమ, ఆప్యాయతను మర్చిపోలేను”అని తెలిపారు.

చాలా బాధాకరం : తలసాని

కన్నడ పవర్‌స్టార్‌గా అభిమానులు పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ మృతి చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. నటుడిగా, సింగర్‌గా, ప్రొడ్యూసర్‌గా తన సమర్థతను చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయని, ఆయన తెలుగు వారికి కూడా పరిచయమేనని అన్నారు. పునీత్ కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News