చికిత్స అనంతరం 6.5 శాతం మంది మృతి
ఎన్‌సిఆర్‌బి అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. 6.5 శాతం మంది రోగులు కొవిడ్ చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏడాదిలోను మృత్యువాతపడినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగానికి చెందిన నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్ 19(ఎన్‌సిఆర్‌బి) అధ్యయనంలో తేలింది. అందులో 18.6 శాతం మంది 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల వారే ఉన్నారు. ఈ వయసు కలిగిన వారు 14,419 మంది మరణించగా, అందులో 616 మంది పురుషులు, 325 మంది మహిళలు ఉన్నారు.
2020 సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 2023 వరకు కొవిడ్ చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి డాటాను ఎన్‌సిఆర్‌బి సేకరించి, ఒక సంవత్సరంలో పోస్ట్-డిశ్చార్జ్ మరణాలకు సంబంధించిన కారకాలను అంచనా వేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక సంవత్సరంలో చనిపోయే అవకాశం 1.7 శాతం రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌కు ముందు కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మరణాల నుండి 60 శాతం రక్షణను అందించిందని అధ్యయనం తెలిపింది. గుండె సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు కొవిడ్ తర్వాత మరణాలకు ప్రదాన కారణంగా ఈ అధ్యయనం పేర్కొంది.