Saturday, November 16, 2024

రాజ్యసభకు సుధామూర్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, వితరణశీలి, రచయిత్రి సుధామూర్తి రాజ్యసభ సభ్యులు కానున్నారు. ఆమెను ఎగువసభకు నామినేట్ చేస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన వెలువరించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆ తరువాత ధృవీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో నారీశక్తికి దక్కిన విలువ ఇదని వ్యాఖ్యానించారు. టెక్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తన సాహితీ ప్రస్థానంతో విశేషరీతిలో సామాజిక చైతన్యం దిశలో సాగుతున్నారు. రాజ్యసభకు నామినేట్ అయిన సమయంలో సుధామూర్తి థాయ్‌లాండ్‌లో ఉన్నారు. వార్తాసంస్థలతో ఫోన్‌లో స్పందించారు. ఈ రోజు మహిళా దినోత్సవం, ఈ దశలో తనకు ఈ వార్త తెలియడం తనకు ఆనందం ఆశ్చర్యం కల్గించిందని తెలిపారు. తాను ఏనాడూ ఎటువంటి పదవులు ఆశించలేదని, అయితే ఇప్పుడు ఈ ప్రకటన దశలో ప్రధానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని, తన బాధ్యతను నిర్వర్తిస్తానని సవినయంగా తెలిపారు. తన ముందు ఓ మరో అవకాశం వచ్చింది. ఈ బాధ్యతలో ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంది? ఏమేం చేయాల్సి ఉందనేది ముందుగా పరిశీలించుకోవల్సి ఉందన్నారు.

73 సంవత్సరాల సుధామూర్తి ఇప్పుడు మూర్తి ట్రస్ట్ నిర్వాహకురాలిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో ఆమె ప్రోఫెషన్ ఆరంభమైంది. కాగా దేశంలో నారీ శక్తిని ఎగువసభలో మరింతగా చాటేందుకు సుధామూర్తి నియామకం దోహదం చేస్తుందని ప్రధాని మోడీ స్పందించారు. దేశ భవితను మరింతగా తీర్చిదిద్దేలా చేసేందుకు మహిళాలోకం మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఇటువంటి పరిణామాలు అవసరం అని తెలిపారు. సామాజిక సేవ, ఫిలాంత్రపీ, విద్యారంగంలో ఆమె నిస్వార్థరీతిలో చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి ఫోటోతో కూడిన ట్వీటు వెలువరించారు. సుధామూర్తి పలు పుస్తకాలు కూడా రాశారు. పిల్లలకు ప్రత్యేకించి ఆమె చేసిన రచనలు తెలుగు సహా పలు భాషలలోకి అనువాదం అయ్యాయి. పురస్కారాలు ఆమెకు కొత్త కాదు 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డు పొందారు. ప్రత్యేకించి ఆమె ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. స్వరాష్ట్రం కర్నాటకలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్థికి, వృద్ధులకు చేయూతకు పాటుపడుతున్నారు. ఇన్‌ఫోసిస్ సంస్థలో ఆమె చొరవతో ప్రత్యేకించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి ( సిఎస్‌ఆర్) విభాగం ఏర్పాటు అయింది. సంస్థ మాజీ ఛైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. నిరాడంబరంగా ఉండే సుధామూర్తి బ్రిటన్ తొలి పౌరురాలు , ప్రధాని రిషిసునాక్ భార్య అక్షిత మూర్తి తల్లి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News