Sunday, April 13, 2025

సామాన్యుడి వెతలు తీరేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

స్వల్పదూర ప్రయాణాలకు తప్పనిసరిగా సాధారణ టికెట్స్, దూర ప్రాంత ప్రయాణాలకు సాధారణ లేదా ముందస్తు రిజర్వేషన్ ద్వారా టికెట్లను పొందాలి. సాధారణ ప్రయాణికిని బాధలు వర్ణనాతీతం. లోతుగా విశ్లేషించడానికి ప్రయాణంలో టికెట్ బుకింగ్ నుండి గమ్యం చేరే వరకు సామాన్యుడు అనుభవిస్తున్న వెతలు. టికెట్ అనేది స్టేషన్ కౌంటర్ లేదా ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇక్కడి నుండే బాధలు మొదలవుతాయి. కౌంటర్ దగ్గర చేంతాడంత లైన్ ఉంటుంది. సరిపోనన్ని కౌంటర్లు ఉండవు. అక్కడ బలమున్నొడికే ముందుగా టికెట్స్ దొరుకుతాయి. జనాలను కంట్రోల్ చేసేందుకు రైల్వేపోలీసులు ఉండ రు. మరి స్త్రీల పరిస్థితి చెప్పనలవి కాదు. స్టేషన్లలో అద్భుతమైన సౌకర్యాలను చదవడానికి బాగుంటాయి. ఉన్నోడు గొంతు తడుపుకోడానికి బాటిల్ నీరు కొనుక్కుంటాడు. సామాన్యునికి తాగునీరు నల్లాలుంటాయి. మంచిదే! కానీ వచ్చే నీరు మంచిదో? కాదో? మనకంటే తాగినవారికి బాగా తెలుస్తుంది! మూత్రానికి వెళ్ళాలన్నా ‘పే అండ్ యూజ్’ అనే బోర్డులు కనిపిస్తాయి.

దీనర్థం తెలియని సాధారణ ప్రయాణికునికి అక్కడికి వెళ్ళేవరకూ వరకూ తెలియదు. కొన్ని స్టేషన్లలో రైలుబండి వచ్చేముందు మాత్రమే అనౌన్స్ చేస్తారు. బోగీ సంఖ్యని ప్రదర్శించే బోర్డు ఉండదు.బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియదు. జనరల్ బోగీకోసం సామాన్యుడు పరుగులు పెట్టాల్సిందే. తప్పదు! ఎందుకంటే సామాన్యుడు పేదవాడు కదా! ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా బండి తప్పిపోయిన వారెందరో? ఈ పరుగులో ఒక్కోసారి చచ్చినోళ్ళు కూడా ఉంటారు. మరణం అనే పదం కేవలం ఉన్నవాడికి పేటెంట్, పేదోడి చావుకి చచ్చాడనే అంటారు. సాధారణ ప్రయాణీకుడు జనరల్ బోగీలోనే వెళ్ళే స్థోమత ఉంటుంది. ప్రతీ స్టేషన్‌లో పరిమితికిమించి సాధారణ టికెట్స్ ఇస్తారు. ఒక్కో బండిలో గరిష్టంగా జనరల్ పెట్టెలు నాలుగు ఉంటాయి. మరి ఈ నాలుగు బోగీలు అందరికీ సరిపోతాయా? ఇక బోగీలోని అవస్థలను చూద్దాం.

భారతదేశంలో జనాభా పెరిగింది కదా అనే విషయం స్పష్టంగా కనిపించేటట్టు జనాలు కిక్కిరిసి ఉంటారు. ఎంత మంది వచ్చినా ఇంకా ఖాళీ ఉండడానికి పురాణాలలో ఉండే పుష్పకవిమానం కాదు కదా! లోపల సౌకర్యాలు గురించి ప్రస్తావించాలంటే ఈ పేపరు చాలదు. ధారావాహిక రూపంలో వ్యాసం రాయాలి. లోపల కూర్చో డం మాట దేవునికి ఎరుక! కనీసం నిల్చోడానికి ఖాళీ ఉండదు. కాలు కదప వీలుకాదు. చంటిపిల్లలు, వృద్ధులు, మహిళల వెతలు చెప్పలేం. రాత్రివేళైతే ప్రయాణీకుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనీసం మరుగుదొడ్డికి వెళ్లాలంటే వీలవదు. అక్కడ కూడాజనాలే! బాత్రూంలో నీరు కొంత సమయం వరకే వస్తుంది. తరువాత షరామామూలే! ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే. మరి ఎలా ప్రయాణించాలని? సామాన్యుని ఆవేదనను పట్టించుకునే వారెవరు? ఇక ముందస్తు (రిజర్వేషన్) టికెట్స్ గురించి చూద్దాం. ఆన్‌లైైన్ లేదా స్టేషన్ కౌంటర్ దగ్గర బుక్ చేసుకునే వీలుంటుంది.

ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సామర్థ్యం ఎంత మంది సామాన్యులకు ఉంటుంది? పోనీ ఇంటర్నెట్ సెంటర్ వాడిని ఆశ్రయిస్తే మన పేరిట ముందుగా ‘ఐడి’ని సృష్టించాలి. దీనికోసం ప్రయాణికునికి ఫోన్, ధర చెల్లించడానికి ఎటిఎం కార్డ్‌ఉండాలి. ఇవి ఎంతమందికి ఉంటాయి. కొన్ని సార్లు పేమెంట్ ఫెయిల్ అవుతుంది. వెంటనే ఖాతాలోకి అమౌంట్ రాదు. మరి వెంటనే టికెట్ బుక్ చేయాలంటే ఎలానో ఆ రైల్వే అధికారులకే తెలియాలి. నెట్ సెంటర్ వాడి ఖాతాతో బుక్ చేసి భవిష్యత్‌లో టికెట్ రద్దుచేస్తే వాడి అకౌంట్‌కే డబ్బులు పోతాయి. వాడినుండి వసూలు చేయాలంటే చాలా కాలం పట్టే అవకాశం లేకపోలేదు. ఎంతమంది ప్రయాణీకులు అరవై రోజుల ముందే ప్రయాణానికి ప్రణాళిక చేయగలరు. అవసరాలు ముందే తెలియవు కదా! ఎందుకోగానీ ఈ మధ్యన ఇలా టికెట్స్ ఓపెన్ అవ్వంగానే బుక్ అయిపోతున్నాయి. కారణం ఏంటో మరి? కొంతమంది బ్రోకర్లు దొంగ ‘ఐడి’లతో టికెట్స్ బుక్ చేయడం ఒక ప్రధాన కారణం కావచ్చు.

రైల్వే టిసిలకు సమయాభావంవలన ప్రయాణీకులు దగ్గర టికెట్ ఉందా? లేదా? పరిశీలిస్తారు గానీ ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తంచూసే సమయం వారికి ఉండదు.రెండు నెలలముందే రైల్వేశాఖ దగ్గర పెద్ద మొత్తంలో టికెట్ అమౌంట్ నిలువ చేయడంవలన వారికి వడ్డీ బాగానే వస్తుంది. కానీ సామాన్యులు అంత పెద్ద మొత్తంలో ముందుగానే మదుపు పెట్టాలంటే కష్టం. అప్పులు చేయక తప్పదు. ఒక్కోసారి కాన్సిల్ చేయాలంటే కాన్సిలేషన్ చార్జీలు ఎక్కువే! అంత చార్జీలు అవసరమా? ఈ టికెట్‌ను వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి ఎలానూ కేటాయిస్తారు. మరి ఎందుకు రద్దు చార్జీలు వసూలు చేయాలి. ఒకవేళ ఎవరికీ కేటాయించకపోతే అప్పుడు చార్జీలు వసూలు చేయొచ్చు. అసలు రిజర్వేషన్ ఎందుకు? ఒక ఐదు రోజుల ముందు టికెట్స్ విడుదల చేస్తే పోలా? మరీ రెండు నెలల ముందు అవసరం లేదు. అన్నీ అవసరాలు అరవై రోజుల ముందు రావుకదా. కొంత మంది అనొచ్చు.

తత్కాల్ ఉందిగా అని? సామాన్యునికి అందుబాటు రేట్లలో ఇవి ఉన్నాయా? ఒక బండిలో ఎక్కువ సంఖ్యలో ఎసి బోగీలు ఉంటున్నాయి. సెకండ్ క్లాస్ సీట్లు తగ్గుతున్నాయి. పోనీ అక్కడైనా సౌకర్యంగా ఉంటుందా? ఎసిబోగీల్లో రగ్గులు, బ్లాంకెట్లు అడిగితే తప్ప ఇవ్వడం లేదు. ఇచ్చినా సరే వాటి వాసన బాగుండడం లేదు. అడుగుదాం అంటే అటెండెంట్ భాష ప్రయాణికులకు రాదు. రద్దీ సమయాలలో స్పెషల్స్ వేస్తున్నారు. మంచిదే! కానీ సరైన ప్రచారం లేక, ఆ విషయం చాలా మందికి తెలియక ఖాళీగా వెళ్లిపోతున్నాయి. అంతేకాదు స్పెషల్ బండి లో టికెట్ ధర సాధారణ బండి కంటే కొంచెం ఎక్కువే మరి! అవునులే! ఆమాత్రం ఉండకపోతే ఎలా? స్పెషల్ కదా!

– జనక మోహనరావు దుంగ
8247045230

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News