Wednesday, January 22, 2025

గ్రేటర్ నగరానికి తాగునీటి అవసరాలకు సరిపడా నీరు

- Advertisement -
- Advertisement -

జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు
అదనపు జలాల కోసం ఎమర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు
ప్రజలెవరూ ఆందోళనకు గురి కావద్దని జలమండలి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్:  ఈ వేసవిలో గ్రేటర్ నగర ప్రజల తాగు నీటి అవసరాలకి సరిపడా నిల్వలు ఉన్నాయని, నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి స్పష్టం చేస్తోంది. ప్రధాన జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో సరిపడా నీరు లేనందున. నగర వాసులకు తాగునీటి సమస్య తలెత్తుతుందని మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో జలమండలి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఓఆర్‌ఆర్ వరకు విస్తరించిన మహా నగర వాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి నాగార్జున సాగర్ జలాశయం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1, 2, 3 ల ద్వారా రోజుకి 270 ఎంజీడీల నీటిని తరలిస్తోంది. ఈ లెక్కన నెలకు 1.38 టిఎంసీల నీటిని సరఫరా చేస్తుంది. మంగళవారం నాటికి నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 138.73 టిఎంసీ, 514.10 అడుగులు ఉంది. గతేడాది ఇదే రోజున 187.07 టీఎంసీలు, 539.40 అడుగుల నీరు ఉంది.

ప్రస్తుతం రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజీ లెవల్ పైన (510 అడుగుల పైన) 7.06 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ వేసవిలో హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఉండదని పేర్కొంది. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. నగరానికి అవసరమైన 270 ఎంజీడీల నీరు సరఫరా చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. రానున్న నాలుగు నెలల వరకు అనగా ఈ జులై చివరి నాటికి కావాల్సిన నీరు సరఫరా చేసేందుకు ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్ల పనులు పూర్తి కావస్తున్నాయి. జలాశయంలో నీటి మట్టం 510 అడుగులకు చేరగానే.. ఈ ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా హైదరాబాద్ కు సరిపడా నీటిని సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని జలమండలి తెలిపింది.

మరోవైపు గోదావరి జలాల కోసం ఎల్లంపల్లి జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు అత్యవసర పంపింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టింది. దీంతో పాటు అవసరాన్ని బట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇవే కాకుండా.. సింగూరు, మంజీరా జలాశయాల్లో సంతృప్తికరమైన నీటి నిల్వలు ఉన్నాయి. కాబట్టి.. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల నగర ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని జలమండలి తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News