Monday, January 13, 2025

చెరకు రైతుల రాయితీలపై వేటు!

- Advertisement -
- Advertisement -

రైతాంగ ప్రయోజనాలకు హరించే విధంగా మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించకపోవటం, విత్తనాలు, ఎరువుల, పురుగుమందుల ధరలు పెంచటం, ఎరువుల ధరల నిర్ణయ అధికారం ఎరువుల కంపెనీలకే ఇవ్వటం, పోషకాలను బట్టి ఎరువుల సబ్సిడీ ఇవ్వటం, ధాన్యం సేకరణ నుంచి ఎఫ్‌సిఐని తప్పించటం, వ్యవసాయ రంగంలోకి బహుశ జాతి సంస్థలకు అవకాశం కల్పించటం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూముల సర్వే చేయించి కార్పొరేట్లకు భూములు కట్టబెట్టటం, రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు బిగించమని రాష్ట్రాలకు చెప్పటం లాంటి చర్యలు ఇప్పటికే అమలు చేసింది. తాజాగా చెరకు రైతులకు ప్రయోజనంగా ఉన్నవాటిని ఉపసంహరిస్తూ ఆర్డర్ జారీ చేసింది. మోడీ ప్రభుత్వ విధానాలవల్ల చెరకు రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.

ఆ సంక్షోభం ఇంకా ఎక్కువ అయ్యేలా మోడీ ప్రభుత్వలోని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 1966 షుగర్ (నియంత్రణ) ఆర్డర్, 2018 నాటి చక్కెర నియంత్రణ ఆర్డర్‌ను కలిపి ది షుగర్ (నియంత్రణ) ఆర్డర్ 2024 ముసాయిదాను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతిక పురోగతి, పరిశ్రమలో మార్పులను పేర్కొంటూ 2024 ముసాయిదా విడుదల చేసినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందటానికి పంచదార రికవరీ రేటును 8.5% నుంచి 10%కి కొత్త ముసాయిదాలో పెంచటం జరిగింది. భారత దేశంలో రికవరీ రేట్ రీడింగ్‌ను సక్రమంగా తెలిపే మిషన్లు లేని కారణంతో పాటు, రికవరీని పెంచే నాణ్యమైన విత్తనం అందక పోవటం వల్ల కొత్త ముసాయిదాలో పేర్కొన్న 10% రికవరీ రేటు రాని పరిస్థితుల్లో రైతులు మద్దతు ధర పొందలేరు.

దేశంలో పంచదార రికవరీ 9.% మించి ఎప్పుడు రాలేదు. 2024 నవంబర్ మొదటి వారంలో 8.82% మాత్రమే ఉంది. బ్రెజిల్ లాంటి కొన్ని దేశాల్లో 11 నుంచి 14% పైగా పంచదార రికవరీ వస్తుంది. షుగర్ (నియంత్రణ) ఆర్డర్ 1966లోని సెక్షన్ 5ఎ, చక్కెర మిల్లుల ద్వారా వచ్చే లాభాల నుండి అదనపు ధర వాటా పొందేందుకు రైతులకు వీలు కల్పించింది. ఇప్పుడు ఆ నిబంధన తొలగించటంతో లాభాలను పంచకుండా తప్పించుకుంటున్న మిల్లులకు వరంలా దొరికింది. ప్రభుత్వం ప్రకటించిన ధరతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా సలహా (ఎస్‌ఎపి) ధరను ప్రకటించటానికి 1966 ముసాయిదాలో వీలు కల్పించిన నిబంధనను కూడా కేంద్ర ప్రభుత్వ కొత్త ఆర్డర్ ముసాయిదా తొలగించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరికొన్ని రాష్ట్రాలు 2 నుండి 5 వందల వరకు సలహా ధరను ప్రకటిస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని సంవత్సరాలు 200 సలహా ధరను ప్రకటించింది. కొత్త షుగర్ (నియంత్రణ) ఆర్డర్ ప్రకారం రాష్ట్రాలు సలహా ధరను ప్రకటించలేవు. చక్కెర మిల్లులు బ్యాంకుల్లో తనకా పెట్టిన పంచదార అమ్ముకోవటానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పక చక్కని కొత్త ముసాయిదాలో పేర్కొన్నారు. ఫలితంగా చెరుకు కొనుగోలు చేసిన 14 రోజుల లోపు మిల్లులు డబ్బులు చెల్లించాలన్న నిబంధన నిరుపయోగంగా మారింది. రైతులకు డబ్బులు ఎప్పుడు చెల్లించాలన్న అధికారం మిల్లులకు దక్కింది. చెరకు విక్రయ డబ్బులు పొందటానికి మిల్లర్ల దయపై రైతులు ఆధార పడాల్సి వస్తుంది. ప్రపంచంలోని 195 దేశాల్లో 124 దేశాలు చెరకు పండిస్తున్నారు. భారత దేశంలో 50 లక్షల ఎకరాల్లో చెరకు సేద్యం జరుగుతున్నది. చక్కెర తయారీ పరిశ్రమలకే కాకుండా, కాగితం, మద్యం, పశువుల దాణా, రసాయనాల తయారీకి ముడి పదార్థాల ఉత్పత్తిని చెరకు సేద్యం అందిస్తుంది. ఎకరాకి సగటు దిగుబడి 30 టన్నుల వస్తుంది. ఎకరాకు సేద్యానికి అన్ని రకాల సేద్యపు ఖర్చు లక్ష దాకా ఉంది. కౌలు రైతుకు అదనంగా మరో 20 వేలు ఖర్చుగా పెట్టాలి. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలోని వ్యవసాయ పరిశ్రమల్లో చక్కెర పరిశ్రమ రెండవ పెద్ద పరిశ్రమ.

చక్కెర ఉత్పత్తిలో బ్రెజల్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 5.60 లక్షల ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేస్తున్నారు. దేశంలో లక్షలాది రైతు కుటుంబాలకు జీవనోపాధిగా ఉండి, ఎందరికో ఉపాధి కల్పిస్తూ, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి అందిస్తున్న చెరకు రైతాంగం ఎడల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా చెరకు సేద్యం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర చెరకు రైతులకు ఏమాత్రం మేలు చేయలేదు. దిగుబడి ఎకరాకు 30 టన్నులు. ప్రభుత్వ చెప్పే క్వింటాల్ చెరకు ఉత్పత్తి ఖర్చు 157 రూపాయలు. వాస్తవ ఖర్చు 305 రూపాయలు. కేంద్రం ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర 350 రూపాయలు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వాస్తవ ఖర్చుపై 50% పెంచితే 450 ప్రకటించాలి. 10% పంచదార రికవరీ వచ్చే చెరకుకి మాత్రమే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుంది.

అంతకన్నా తక్కువ రికవరీ వస్తే తగ్గిన దాని ప్రకారం మద్దతు ధరలో కోత పడుతుంది. మద్దతు ధర ప్రకారం 30 క్వింటాళ్లు వచ్చిన రైతుకు లక్షా, ఐదు వేల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం సొంత భూమి రైతుల ఖర్చులకు సరి పోవటం లేదా నామమాత్రపు మిగులు ఉంటుంది. కౌలు రైతులకు పెట్టుబడి కూడా రాదు. టన్ను చెరకు ద్వారా 280 కిలోల పంచదార లభిస్తుంది. కేజీ 30 చొప్పున 8680 రూపాయలు వస్తుంది. మద్దతు ధర ప్రకారం టన్ను చెరకు ద్వారా రైతుకు లభించేది 3500 రూపాయలు. మిల్లు యజమానులకు మిగులుతున్నది 5,180 రూపాయలు. ఎకరం చెరకు పైన మిల్లు యజమాని 1,60,580 రూపాయలు మిగులు పొందుతాడు. ఫ్యాక్టరీ ఖర్చుల కింద 50 వేలు తీసేసినా లక్షకు పైగా మిగులుతుంది. దేశంలో 453 చక్కెర మిల్లులు ఉంటే, వాటిల్లో 252 సహకార రంగంలో, 67 ప్రభుత్వ రంగంలో ఉంటే, 134 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. సహకార, ప్రభుత్వ పంచదార మిల్లులను ప్రోత్సహించాల్సి మోడీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వాటిని మూసివేయటం లేదా అమ్మివేయటం చేస్తున్నది. చెరకు రంగమంతా నేడు ఎక్కువగా ప్రైవేట్ పరిశ్రమల చేతుల్లో ఉంది. రైతులు, ప్రైవేట్ మిల్లులకే 90% చెరకు విక్రయిస్తున్నారు.

మిల్లుల యజమానులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా తక్కువ ఇస్తూ రైతాంగాన్ని దోసుకుంటున్నారు. సకాలంలో డబ్బులు ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సంవత్సరాల తరబడి వేలాది రూపాయలు రైతులకు బకాయిలు పెట్టారు. ప్రస్తుతం రూ. 5 వేల కోట్ల దాక రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి మిల్లులు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోకుండా మిల్లు యజమానుల ప్రయోజనాల కోసం తానే హామీ ఉండి వేలాది కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించింది. రైతాంగం మాత్రం అప్పుల్లో కూరుకుపోయారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా చెరకు సేద్యం నష్టదాయకంగా మారటంతో చెరకు సేద్యం ఎడల రైతుల్లో విముఖత ఏర్పడి లక్షలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఫలితంగా 2022లో పంచదార ఉత్పత్తి 328.7 లక్షల టన్నులు ఉండగా, 2023 నాటికి 311 లక్షల టన్నులకు తగ్గింది. సేద్యాన్ని నష్టదాయకంగా మార్చి రైతాంగం సాగు నుండి తప్పుకునేలా చేసి, చెరకు పంటను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి, పంచదారను విదేశాల నుంచి మోడీ ప్రభుత్వం దిగుమతి చేసుకోనుంది. ఇప్పటికే 3 లక్షల టన్నుల దేశంలోకి దిగుమతి అయింది. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యావన్మంది చెరకు రైతులు ఉద్యమించాలి. 2924 షుగర్ (నియంత్రణ) ఆర్డర్ ముసాయిదాను ఉపసంహరించాలని, టన్నుకు చెరకుకు 4,775 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేయాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News