Tuesday, December 24, 2024

కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు, కేసిఆర్‌ను కాదని, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను వివరంగా పేర్కొని హామీ ఇచ్చారు. ప్రజలు తక్షణ కర్తవ్యంగా కోరుకునేవి కొన్ని ఉన్నాయి. విద్యార్థులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పీజు రీఎంబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి. ప్రైవేటు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ప్రైవేటు యూనివర్శిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మేరకు 50 శాతం తప్పనిసరిగా నింపాలి. అందుకు చట్టసవరణ చేయా లి. మహిళలకు నాన్ ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు రాష్ట్ర మంతటా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.కుల గణన వెంటనే చేపట్టాలి. సమగ్ర కుటుంబ సర్వే చేసినంత వేగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల ద్వారా చేపట్టాలి. అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ఈ కమిషన్‌ల నియంత్రణలో పని చేయడానికి ఉత్తరువులు జారీ చేయడం అవసరం. 15 రోజులలోనే కులగణన వివరాలు కంప్యూటరీకరించాలి. జనవరిలో జరుగనున్న సర్పంచ్, జడ్పీటీసీ, మండల, స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక వర్గాల రిజర్వేషన్లకు ఈ కులగణన ప్రాతిపథికగా తీసుకోవాలి.

రిజర్వేషన్లు కనీసం 50 శాతం మేరకు పెంచడం అవస రం. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నా యి. బీసీ కులగణన ద్వారా జాతీయ సాథయిలో ఓ బీసీల హృదయాలను గెలుచుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో గొప్ప ప్రభావం వేయవచ్చు. వందేళ్ల తర్వాతయినా కులాల లెక్కలు తీయడం ద్వారా సమగ్ర సామాజిక అభివృద్దికి కృషి చేసినవారవుతారు.
ఉద్యోగాల భర్తీకి నియోజకవర్గాలవారీగా ప్రాతినిథ్యం లభించినప్పుడు అసమానతలు తగ్గుతాయి. అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు నియోజక వర్గాల వారీగా నిర్థిష్ఠంగా రూపొందించడం అవసరం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలు అన్నిటినీ ఆయా శాఖల కింద ప్రభుత్వం యూనివర్శిటీలుగా అభివృద్ది పరచడం అవసరం.పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేసిన తర్వాత సిబ్బందిని పెంచకుండా పది జిల్లాల సిబ్బందినే ముప్పై మూడు జిల్లాల్లో సర్దిపెట్టారు. తద్వారా పరిపాలన కుంటు పడింది. పాత జిల్లాల్లో ఎంత సిబ్బంది ఉందో ప్రతి జిల్లాలో అంత సిబ్బందిని నియమించడం అవసరం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న పారిశుద్య కార్మికులు, డ్రైవర్లు, కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలైన వారిని పేదరికం నుంచి వచ్చినవారే. వారికి నియమిత స్కేలు యివ్వడానికి ముందు పదివేల రూపాయలు పెంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చుకోవాలి.

ఉద్యోగ పోటీ పరీక్షల్లో వీరి అనుభవానికి 10 శాతం మార్కులు కలిపి లెక్కించాలి.
మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ తదితర పథకాలలోని లోటు పాట్ల పై సమగ్రమైన విచారణ కమిషన్ నియమించి వాస్తవాలు వెల్లడించాలి. ప్రతి ఊరికి రక్షిత మంచినీరు ఇచ్చారని అంటున్నారు. కానీ చాలా ఊర్లకు ఇప్పటికీ నల్ల నీరు అందడంలేదు. వీటన్నిటిని క్షేత్ర పర్యటనలో సేకరించాలి. ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించాలి. చేపలు, గొర్రెలు ఉచితంగా పంపిణీ చేసి న పథకాల్లో, డబుల్ బెడ్రూవ్‌ు పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకాలు ఏమేరకు సద్వినియోగం అయ్యాయో తేల్చి చెప్పడానికి, సక్రమ వినియోగానికి ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం అవసరం.1996 నుండి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమం చేస్తున్నవారిపై అనేక రకాల కేసులు పెట్టబడ్డాయి. 1996 నుండి 2023 డిసెంబర్ దాకా పెట్టిన ఇలాంటి కేసులను మొత్తం ఉపసంహరించుకోవాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కేటాయిస్తానన్న ఇంటి స్థలాన్ని, ఆర్థిక సాయాన్ని, పెన్షన్‌ను, ఉద్యమ కారులకు గౌరవ స్థానాలను, నామినేటెడ్ పదవులలో తీసుకొని వారి సేవలను సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించుకోవాలి. ఆయా కార్పొరేషన్లకు హితోదిక నిదులు సమకూర్చడం అవసరం. 50కి పైగా విభిన్న కార్పొరేషన్లు ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేయడం జరిగింది.

వాటికి బడ్జెట్లు లేక నీరిసించి పోయాయి. వాటిని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చక్కగా వినియోగించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిపార్ట్‌మెంట్ల ద్వారా విద్యావంతులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధికల్పన కోసం గత కొన్నేళ్ళుగా బడ్జెట్లు కేటాయించడం లేదు. ఒక్కొక్క శాఖకు ఐదు వేల కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ కేటాయించి వెంటనే లోన్లు శాంక్షన్ చేయడం అవసరం.పదిహేను రోజుల్లో అన్ని శాఖల రిటైర్డ్ ఖాళీలను, అన్ని ఖాళీలను వెంటనే వివరాలు తెప్పించుకోవాలి. కొత్త పోస్ట్‌లను సృష్టించాలి. కొన్ని డిపార్ట్‌మెంట్లలో 1996 నుంచి నియామకాలు లేవు. ఔట్‌సోర్సింగ్‌తో, కాంట్రాక్ట్ ఉద్యోగులతో నడిపిస్తున్నారు. వాటన్నిటిని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి చాలా ఉద్యోగాలను తొలగించాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రమే సర్వీస్ కమిషన్‌కు కేటాయిస్తే చాలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పునర్‌వ్యవస్తీకరించడం అవసరం. ఉగాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అవసరమైన కొత్త పోస్టులను సృష్టించాలి. తొలుత స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్శిటీలలో సంవత్సరాల తరబడి ఖాళీలున్నాయి. వెంటనే అవన్నీ భర్తీ చేయాలి.

తద్వారా ఉన్నత విద్యావంతులకు ఊరట లభిస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకోకుండ నిరీక్షిస్తున్నవారు ఒక ఇంటివారవుతారు. జర్నలిస్టులకు చాలాకాలం నుంచి పెండింగ్‌లో పడుతున్న ఇండ్ల స్థలాల కేటాయింపు వెంటనే చేపట్టడం అవసరం. పత్రికలకు, మీడియాకు పక్షపాతంతో ప్రభుత్వ ప్రకటనలు సరిగ్గా ఇవ్వలేదు. ఈ దుస్థితి తొలగించి అందరికి తగువిధంగా పత్రికా ప్రకటనలు జారీ చేయడం అవసరం. భారత రాజ్యాంగం అందరు చదవాలి. అందుకు సులభశైలిలో భారత రాజ్యాంగాన్ని పరిచయం చేసే పుస్తకాలను వారి వారి భాషల్లో అచ్చువేసి ప్రతి ఇంటికి అందించాలి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మ్యానిఫెస్టోను అచ్చువేసి ప్రతి ఇంటికి ఉచితంగా అందించాలి. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కోరుకున్న విధంగా బదిలీలు, వారి సంఘాల జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించడం అవసరం.

బి.ఎస్. రాములు
సామాజిక తత్వవేత్త
తెలంగాణ బిసి కమిషన్ తొలి ఛైర్మన్
8331 966 987

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News